రామాయణ గాధను ఎన్నిసార్లు విన్నా… ఎన్ని సార్లు చూసినా ఆనందంగానే ఉంటుంది. భారతీయ సినిమాలో ‘రాముడి’ సినిమాలు చాలానే వచ్చాయి. వచ్చినన్నిసార్లు మంచి విజయాలే అందుకున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా రాముడి సినిమాలు పెద్దగా రావడం లేదు. అయితే బాలీవుడ్‌లో ఇప్పుడు చూస్తే… రాముడి సినిమాలు వరుస కడుతున్నాయి. ఒక్కసారిగా రాముడి పాత్ర ఎందుకు బాలీవుడ్‌లో కీలకంగా మారింది అనే ప్రశ్న వేస్తే… ఆసక్తికర జవాబు వస్తోంది. రాముడి పాత్రతోనో, రామాయణం నేపథ్యంలోనే వరుస సినిమాలు ఎందుకు చేస్తున్నారు అనేది తర్వాత మాట్లాడుకుందాం.
ప్రస్తుతం ఏయే సినిమాలో వస్తున్నాయో ఒకసారి చూద్దాం. సెట్స్ మీద ఉన్న సినిమా అయితే ‘ఆది పురుష్’ ఒక్కటే. ఇందులో ప్రభాస్ రాముడిగా… సీతగా కృతి సనన్ నటిస్తోంది. ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇది కాకుండా కంగన రనౌత్ ప్రధాన పాత్రలో ‘సీత’ తెరకెక్కబోతోంది. మిగిలిన పాత్రల గురించి తెలియాల్సి ఉంది. ఈ రెండు కాకుండా కొన్నేళ్ల క్రితం అల్లు అరవింద్, మధు మంతెన కలసి త్రీడీలో రామాయణం తీయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి కొన్ని పనులు జరిగినా, కరోనా కారణంగా ముందుకెళ్లలేదు.
ఈ సినిమా తెలుగు వెర్షన్ త్రివిక్రమ్ రాశారని టాక్. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా… రావణుడిగా హృతిక్ రోషన్ నటిస్తున్నారని టాక్. ఇది కాకుండా ‘రామసేతు’ పేరుతో రామాయణ ఇతివృత్త నేపథ్యంలో అక్షయ్ కుమార్ ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు అసలు పాయింట్‌కి వద్దాం. బాలీవుడ్‌లో వరుసగా రామాయణ నేపథ్య సినిమాలు తీయడానికి కారణం ఓ ప్రధాన పార్టీ మెప్పుకోసమే అని అంటున్నారు. ఓవైపు అయోధ్యలో రామాలయం పూర్తవుతుండటం, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో రామాయణ నేపథ్య సినిమాలు తీసి, ఆ పార్టీ పెద్దాయన మెప్పు పొందాలని బాలీవుడ్ ఆరాటపడుతోందని సినీ విమర్శకులు అంటున్నారు. దీంట్లో నిజానిజాలు ఏంటో చూడాలి.