‘పఠాన్’ సినిమా కోసం షారుఖ్ ఖాన్ ప్రచారం కోసం సంప్రదాయ బాలీవుడ్ దారుల్ని పక్కనపెట్టేసిన విషయం తెలిసిందే. సినిమా ప్రచారం పెద్ద పెద్ద పట్టణాల్లో తిరగడం, ఈవెంట్లు ఏర్పాట్లు లాంటివి చేస్తుంటారు బాలీవుడ్ జనాలు. అయితే మనోభావాల బ్యాచ్‌కు దొరక్కుండా షారుఖ్ వేరే దారులు ఎంచుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానంలోకి రామ్‌చరణ్‌ను లాకొచ్చాడు.
షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పఠాన్’. దీపిక పడుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం మరో కీలక పాత్రధారి. జనవరి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా షారుఖ్ నిర్వహించిన ట్విటర్ ఇంటరాక్షన్‌లో ఓ అభిమాని ‘సినిమా విడుదల రోజున తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్‌కు వస్తారా’ అని అడిగాడు. దీనికి షారుఖ్ స్పందిస్తూ రామ్‌చరణ్ పేరును ప్రస్తావించాడు. దీంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.
‘‘పఠాన్’ సినిమా విడుదల రోజున టాలీవుడ్‌కి రావాలని నేను కూడా అనుకుంటాను. మీరు అన్నట్లే తప్పకుండా విజిట్ చేస్తా! అయితే థియేటర్లకు నన్ను రామ్ చరణ్ తీసుకువెళ్తేనే’’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో ఫ్యాన్ష్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటు రామ్‌చరణ్ అభిమానులు, అటు షారుఖ్ అభిమానులు పొంగిపోతున్నారు. చరణ్ అంటే షారుఖ్‌కి అంత ఇష్టమా అని అనుకుంటున్నారు. గతంలో కూడా ఓసారి షారుఖ్ ఇలా రామ్‌చరణ్ పేరును తీసుకొచ్చాడు.
‘ఆర్ఆర్ఆర్’కి మీరు ఆస్కార్ తీసుకొచ్చేటప్పుడు నన్ను ఓసారి టచ్ చేయనివ్వండి అంటూ షారుఖ్ రిక్వెస్ట్ చేశాడు. మరి షారుఖ్ కోసం రామ్‌చరణ్ ముందుకొస్తాడా.. బాలీవుడ్ బాద్షాను హైదరాబాద్ తీసుకొస్తాడా అనేది చూడాలి. ఒకవేళ రామ్‌చరణ్ ముందుకొచ్చి షారుఖ్ టాలీవుడ్ వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది అభిమానులకు. అన్నట్లు ఈ సినిమా మీద తొలుత విమర్శలు వచ్చినా.. ఇప్పుడు దేశాన్ని రక్షించే పోరాట యోధుల సినిమా అని తెలిసి బాయ్‌కాట్ బ్యాచ్ కూడా కామ్ అయిపోయారు.