సల్మాన్ ఖాన్ హీరోగా ‘సికందర్'(Sikandar) అనే హిందీ సినిమా వచ్చింది. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. సల్మాన్ ఖాన్ అభిమానులు కూడా ఆ సినిమాని ఆల్మోస్ట్ మర్చిపోయారు.కానీ ఆ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. తాజాగా హీరోయిన్ రష్మిక ‘సికందర్’ సినిమా గురించి మాట్లాడి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.
రష్మిక మాట్లాడుతూ… ” ‘సికందర్’ సినిమా కథ మొదట నాకు మురుగదాస్ చెప్పింది వేరు. కానీ తర్వాత స్క్రిప్ట్ మొత్తం మారిపోయింది. ఎప్పుడైతే మేకింగ్ స్టేజికి వెళ్ళిందో.. అప్పుడు పరిస్థితుల మారాయి. వాటికి తగ్గట్టు స్క్రిప్ట్ కూడా మార్చాల్సి వచ్చింది. అది సినిమాకి మైనస్ అయ్యి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది” అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

రష్మిక కామెంట్స్ ను బట్టి చూస్తుంటే.. మొన్నామధ్య దర్శకుడు మురుగదాస్ చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. ‘మదరాసి’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మురుగదాస్ మాట్లాడుతూ.. ‘నా గత చిత్రం హీరో వల్లే వర్కౌట్ కాలేదు. అతను డే టైంలో షూటింగ్ కి వచ్చేవాడు కాదు. అందువల్ల నైట్ టైం షూటింగ్ చేయాల్సి వచ్చేది. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేశాము. అందరూ నిద్రపోయే టైంలో షూటింగ్ చేయడం అనేది చాలా ఇబ్బంది.
సాయంత్రం పూట తీయాల్సిన సన్నివేశాలు కూడా తెల్లవారు జామున చేశాం. అందువల్ల సినిమా చూసిన ఆడియన్స్ సీన్ మూడ్ కి కనెక్ట్ అవ్వలేకపోయారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తర్వాత రిలీజ్ అయిన ‘మదరాసి’ డిజాస్టర్ కావడం వల్ల మురుగదాస్ ను సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. అందువల్ల మురుగదాస్ చేసిన వ్యాఖ్యలు కూడా అబద్దం అనుకున్నారు. కానీ ఇప్పుడు రష్మిక కామెంట్స్ ని బట్టి చూస్తే.. మురుగదాస్ ఆవేదనలో తప్పులేదేమో అనిపించక మానదు.
