కొచ్చి నగరంలో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున గోశ్రీ బ్రిడ్జి సమీపంలోని ఓ ఫ్లాట్‌లో హైబ్రిడ్ గంజాయిని సేవిస్తున్న ఇద్దరు మలయాళ దర్శకులు సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన దర్శకులు ఖలీద్ రెహమాన్ (Khalid Rahman) , అష్రఫ్ హంజా కాగా, వీరితో పాటు షలీఫ్ మహ్మద్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ అధికారులు 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ఫ్లాట్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్‌కు చెందినదిగా గుర్తించారు. సీక్రెట్ సమాచారం ఆధారంగా ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఈ ముగ్గురిని పట్టుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, దర్శకులు ఖలీద్, అష్రఫ్ ఇద్దరూ వైద్య పరీక్షల అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు విచారణను మరింత ముమ్మరం చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఖలీద్ రెహమాన్ మలయాళంలో జింఖానా (Alappuzha Gymkhana ), తల్లుమాల వంటి చిత్రాలకు దర్శకత్వం వహించగా, అష్రఫ్ హంజా తమాషా, భీమంటే వాజి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఇద్దరూ మలయాళ ఇండస్ట్రీలో నేచురల్ స్టోరీలతో గుర్తింపు పొందారు. అయితే డ్రగ్స్ కేసులో ఫడపడిన నేపథ్యంలో ఇప్పుడు వారి కెరీర్‌పై భారీ మచ్చ పడే అవకాశం ఉంది. పరిశ్రమలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంకా హైబ్రిడ్ గంజాయి కేసులో నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) , శ్రీనాథ్ భాసిలకు కూడా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తస్లీమా సుల్తానా అలియాస్ క్రిస్టినా, కె ఫిరోజ్, సుల్తాన్ అక్బర్ అలీ వంటి డ్రగ్స్ సరఫరాదారులను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.
ఈ వ్యవహారం పరిశ్రమపై తీవ్ర నెగటివ్ ఇంపాక్ట్ చూపించనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఈ సంఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. డ్రగ్స్ వినియోగం ఫిల్మ్ ఫీల్డ్‌ని నాశనం చేస్తుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఎక్సైజ్ శాఖ మరిన్ని కఠిన చర్యలు తీసుకోనుందని సమాచారం.