సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో, మరికొంతమంది రోడ్డు ప్రమాదాల వల్లో.. ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది సినిమా వాళ్ళు మృతి చెందారు. ఈ మధ్యనే నటుడు సప్తగిరి (Sapthagiri) తల్లిగారు కూడా మరణించినట్టు అతను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నిర్మాత సలీమ్ అక్తర్ ఈరోజు కన్నుమూసినట్టు సమాచారం. ఆయన వయసు 82 ఏళ్ళు అని తెలుస్తుంది. కొన్నాళ్లుగా వయోభారం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న అక్తర్.. చికిత్స నిమిత్తం ఇటీవల ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే కన్నుమూసినట్టు స్పష్టమవుతుంది. దీంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అతని ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్ సినీ పెద్దలు, నటీనటులు కోరుకుంటున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం నిర్వహించబోతున్నారు కుటుంబ సభ్యులు.ఇక సలీమ్ అక్తర్ సినీ కెరీర్ ను గమనిస్తే.. మిల్కీ బ్యూటీ తమన్నాను (Tamannaah) ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ మూవీతో లాంచ్ చేసింది ఇతనే. 2005 లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే ఇంకా చాలా మంది పాపులర్ నటీనటులను పరిచయం చేశారు. ఆమిర్ ఖాన్, బాబీ డియోల్ వంటి స్టార్స్ తో కూడా ఈయన సినిమాలు చేశారు.