టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన ప్రవర్తన మార్చుకోవాలని అంటున్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా. విజయ్ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి కోట్లలో నష్టపోయారు అభిషేక్ నామా. టాలీవుడ్ లో చాలా మంది హీరోలతో కలిసి పని చేసిన అభిషేక్.. విజయ్ దేవరకొండ తీరుపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో తనకు మంచి సపోర్ట్ ఉందని.. శత్రువులు ఎవరూ లేరని చెప్పిన అభిషేక్ తన కెరీర్ లో బాగా బాధ పెట్టిన సంఘటన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ప్లాప్ కావడమని అన్నారు.
ఊహించని విధంగా సినిమా డిజాస్టర్ అయిందని.. కనీసం పది శాతం కూడా పెట్టిన డబ్బులు రాలేదని అన్నారు. సినిమా పోయిన తరువాత హీరో విజయ్ దేవరకొండ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదని.. అతడి తీరుతో చాలా బాధపడ్డానని చెప్పారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను కూడా తనే డిస్ట్రిబ్యూట్ చేశానని.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా రిలీజ్ సమయానికి విజయ్ మార్కెట్ బాగా పెరగడంతో.. ఫ్యాన్సీ రేటు పెట్టి సినిమాను కొన్నామని.. కానీ అది డిజాస్టర్ అయిందని చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండకి కాస్తయినా బాధ్యత ఉండాలి.. కానీ ఆయనకు అది లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
తన కారణంగా అవతలి వాళ్ల డబ్బు పోయిందని కొంచమైనా రెస్పాండ్ అయి ఉంటే సంతోషించేవాళ్లమని కానీ అలా చేయలేదని బాధ పడ్డారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్నో కష్టాలు పడితే సినిమా అవుతుందని.. కానీ క్రెడిట్ లో చాలా భాగం హీరోదే అని.. అందుకే హీరోకి బాధ్యత ఉండాలని అన్నారు. సక్సెస్ వస్తే సంతోషాన్ని పంచుకుంటారు.. అదే ఫ్లాప్ వస్తే కనీసం ఫోన్ కూడా తీయకుండా స్విచ్ఛాఫ్ చేస్తే బాధ అనిపిస్తుంది కదా అంటూ వాపోయారు. ఇప్పుడే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తుంటే.. రేపటి రోజున సినిమా చేయగలమా..? అంటూ ప్రశ్నించారు. విజయ్ దేవరకొండ ఈ విషయంలో మారాలని.. కనీసం మోరల్ సపోర్ట్ అయినా అందిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు.