‘బ్రో’ సినిమా గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటో మీకు తెలుసుగా… అదేనండి రాంబాబు వర్సెస్ శ్యాంబాబు. ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు… ‘బ్రో’ సినిమాలో పనీపాట లేని, జీవితాన్ని సీరియస్‌గా తీసుకోని శ్యాంబాబు మధ్యనే ఈ గొడవ సాగుతోంది. సినిమా రాగానే ఇన్‌డైరెక్ట్‌గా మొదలైన ఈ కామెంట్లు.. ఇప్పుడు ఓపెన్ అయిపోయాయి. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, నిర్మాత గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా దీనిపై చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు.
‘బ్రో’ నిర్మాత అమెరికా నుండి బ్లాక్ మనీని ఇక్కడకు తెచ్చి వైట్ మనీగా మారుస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలో ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు డబ్బులు విశ్వప్రసాద్‌కు ఇస్తే.. ఆ డబ్బును ఇండియాకు తెచ్చి పవన్ కల్యాణ్‌కు పారితోషికంగా ఇచ్చారని విమర్శించారు. ‘బ్రో’లో శ్యాంబాబు పాత్రకు రాంబాబుకు పోలికే లేదని చెప్పారు. శ్యాంబాబు డాన్స్‌కు, సంక్రాంతి సంబరాల్లో రాంబాబు వేసిన డాన్స్‌కు సింకే లేదని చెప్పారు.
అంతేకాదు శ్యాంబాబు రాజకీయ నాయకుడు కాదని గుర్తు చేశారు. కాకపోతే ఒక్క టీషర్ట్ ఒక్కటే రెండు విషయాల్లో కామన్‌గా ఉందని క్లారిటీ ఇచ్చారు. ఈ ఒక్క విషయాన్ని పట్టుకుని వివాదం చేయడం సరికాదని విశ్వప్రసాద్ అన్నారు. తనను కించపరచడానికే ఈ పాత్ర చేశారని రాంబాబు అనుకుంటే మేమేమీ చేయలేమని అన్నారు. ఈ సినిమా నిర్మాణంలో ముగ్గురు ఉన్నారని విశ్వప్రసాద్ తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్, నెట్‌ఫ్లిక్స్ కలిపి ఈ సినిమా తీశాయని స్పష్టం చేశారు. నిజానికి తమ పెట్టుబడి తమకు వచ్చేసిందని… ఇప్పుడు ఏం వచ్చినా లాభమే అని చెప్పారు.
ఇక బ్లాక్ మనీ కామెంట్ల గురించి మాట్లాడుతూ.. అమెరికాలో బ్లాక్ మనీ అనే కాన్సెప్ట్ ఉండదని, అక్కడ క్లియర్‌గా రిపోర్టెడ్ ఇన్‌కమ్ మాత్రమే ఉంటుందని చెప్పారు. ట్యాక్స్ కట్టాక ఆ మనీని ఇండియాకు పంపించుకోవాలి. దాంతో ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. కాబట్టి అమెరికా నుండి బ్లాక్ మనీని ఇండియాకు తీసుకురావడం అసాధ్యం అని విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. ఇక పవన్‌పై అంబటి రాంబాబు సినిమా తీయబోతున్నారనే కామెంట్స్ మీద కూడా నిర్మాత స్పందించారు. ‘నాకు (TG Vishwa Prasad) సంస్కారం ఉంది. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడను’ అని అన్నారు.