మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను అలాగే చిన్న గ్లింప్స్ ను విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో ఈ చిత్రం గ్లింప్స్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
తెలుగులో గ్లింప్స్ కు వెంకటేష్, తమిళ్ గ్లింప్స్ కు కార్తీ, హిందీ గ్లింప్స్ కు జాన్ అబ్రహం, కన్నడ గ్లింప్స్ కు శివరాజ్ కుమార్, మలయాళం గ్లింప్స్ కు దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇక తెలుగు గ్లింప్స్ విషయానికి వస్తే.. “అది 70వ దశకం. బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాలను చూసి భయపడుతుంది. దడదడమంటూ వెళ్లే రైలు ఆ ప్రాంతం పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది.
ఆ ఊరు మైలు రాయి కనబడితే.. జనం అడుగులు తడబడతాయ్.! దక్షిణ భారతదేశపు నేర రాజధాని, ది క్రైం కేపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా స్టూవర్టుపురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది. టైగర్ జోన్. ది జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు’ అంటూ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందించిన ఈ గ్లింప్స్ ఒక నిమిషం 33 సెకన్ల పాటు ఉంది.
చివర్లో ‘జింకలను వేటాడే పులులను చూసుంటావు. పులులను వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా?’ రవితేజ వాయిస్ ఓవర్లో వచ్చిన డైలాగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన బిజీ యం కూడా హైలెట్ గా నిలిచింది.ఒక్క గ్లింప్స్ తోనే (Tiger Nageswara Rao) ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పాలి. అక్టోబర్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది.