టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, అలాగే ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత అయిన టి. జి.విశ్వప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతని తల్లి శ్రీమతి టి జి గీతాంజలి ఈ రోజు సాయంత్రం 6.10 నిమిషాలకు కాలం చేశారు. ఆమె వయసు 70 ఏళ్ళు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. మెరుగైన చికిత్స అందించినా ఆమె కోలుకోలేదు అని స్పష్టమవుతుంది.
ఈ క్రమంలో ఆమె చివరి కోరిక తీర్చేందుకు (TG Vishwa Prasad) విశ్వప్రసాద్.. ఆమెను వారణాసి కి తీసుకువెళ్ళారు. అక్కడ దైవ దర్శనం చేసుకున్న తర్వాత, ఈరోజు ఆవిడ తుది శ్వాస విడిచారు అని తెలుస్తుంది. గీతాంజలి గారికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వ ప్రసాద్ గారు పెద్ద కొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు విశ్వప్రసాద్ తెలిపారు. టి.జి.విశ్వప్రసాద్ గారు ‘ఎం.ఎల్.ఏ’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు.
అటు తర్వాత ‘గూఢచారి’ ‘ఓ బేబీ’ ‘వెంకీ మామ’ ‘కార్తికేయ 2 ‘ ‘ధమాకా’ వంటి హిట్ సినిమాలు నిర్మించారు. ఇటీవల ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ ను తెలుగులో రిలీజ్ చేసింది ఈ సంస్థే. అలాగే ప్రభాస్ తో ఓ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. మారుతి ఆ చిత్రానికి దర్శకుడు. మరోపక్క పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నారు. శర్వానంద్ తో కూడా ఓ సినిమాను నిర్మిస్తున్నారు.