కొన్ని సినిమాల్లో హీరోయిన్ కంటే అందులో ఐటెమ్ సాంగ్ చేసిన భామనే పాపులర్ అవుతూ ఉంటుంది. ఆ సినిమా పేరు తర్వాత ఎప్పుడైనా ప్రస్తావిస్తే ఆ పాట, ఆ హీరోయిన్ గుర్తొస్తుంటారు. అంతలా ఇండియన్ సినిమా విజయం సాధించిన ఐటెమ్ సాంగ్ బ్యూటీల్లో తమన్నా(Tamannaah Bhatia) ఒకరు. ఆమె ప్రత్యేక గీతాలు ఎప్పుడూ ఫేమసే. రీసెంట్ టైమ్‌లోనే ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పూజా హెగ్డేకి (Pooja Hegde) అలాంటి అవకాశం రాబోతోందా?
అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ (Rajinikanth) – దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కలయికలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’(Coolie). సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ (Kalanithi Maran) నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్నారు. చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. సినిమాలో కీలక సమయంలో ఓ పాట వస్తుందని.. అది ఐటెమ్ సాంగ్ అని చెబుతున్నారు.
‘జైలర్’ (Jailer) సినిమాలోని ‘కావాలయ్యా’ పాట తరహాలోనే ఈ పాట కూడా ఉంటుందని, ఆ పాట కోసం పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు అని సమాచారం. ఇప్పటికే ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్లు చెబుతున్నారు. ఈ పాట క్లిక్ అయితే ‘నువ్వు కావాలయ్యా..’ అంటూ ఇండియన్ సినిమా ఆమె వెంట పడొచ్చు. ‘జైలర్’ తర్వాత తమన్నా విషయంలో ఇదే జరిగిన విషయం తెలిసిందే. ఇక ‘కూలీ’ సినిమా విషయానికొస్తే..
బంగారం స్మగ్లింగ్ అంశం నేపథ్యంలో రూపొందుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తాడట. ఇక ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ (Aamir Khan) , నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), శ్రుతి హాసన్ (Shruti Haasan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటివరకు లోకేశ్ కనగరాజ్ డ్రగ్స్ – గన్స్ చుట్టూనే తిరిగారు. తొలిసారి స్మగ్లింగ్‌వైపు వచ్చారు. మరి ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్శ్‌లో భాగమో కాదో చూడాలి.