ఐదు సినిమాలు పోటీ పడి.. ఆఖరికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ సంక్రాంతికి. దీని వల్ల నిర్మాతలకు ఎంత తలనొప్పి వచ్చింది అనేది పక్కనపెట్టి… ఇండస్ట్రీకి ఏం వచ్చింది అనేది ఆలోచిస్తే ఆసక్తికర అంశం ఒకటి తెలుస్తుంది. అదే సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి టాలీవుడ్‌లో ఉందని. ఈ ఏడాది ఇచ్చిన ఉత్సాహమో ఏమో వచ్చే సంక్రాంతికి కూడా నాలుగు సినిమాల్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు.
అయితే, ఆ నాలుగు అగ్ర హీరోల సినిమాలే అని లేటెస్ట్ సమాచారం. ఇప్పటికే మూడు సినిమాలు సంక్రాంతి డేట్‌ను ప్రకటించగా… మరికొన్ని పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి అని అంటున్నారు. వీటిలో ఎంతవరకు పక్కా అయ్యాయి అనేది పక్కన పెడితే వచ్చే సంక్రాంతికి నాలుగు అగ్ర సీనియర్ హీరోలు సినిమాలతో రావడానికి రెడీ అవుతున్నారు. అందులో చిరంజీవి ‘విశ్వంభర’ ఫిక్స్ కాగా… బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సినిమాలు కూడా రెడీ చేస్తారని టాక్.
2023 సంక్రాంతికి ‘గుంటూరు కారం’, ‘సైంధవ్’, ‘నా సామిరంగా’, ‘హను – మాన్’ వచ్చాయి. ఒక్క సినిమా తప్ప మిగిలిన మూడు మంచి వసూళ్లే సాధించాయి. సరైన టాక్ రాకపోయినా డబ్బులు వచ్చాయి అని అంటుండటంతో మోస్తరు సినిమాల్ని కూడా సంక్రాంతికి తీసుకొస్తే వసూళ్లు వచ్చేస్తాయి అని ఓ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ సినిమాలు రెడీ చేయాలని చూస్తున్నారు.
బాలకృష్ణ (Balakrishna) – బాబి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాను దసరాకు రిలీజ్ చేస్తారని అంటున్నారు. అయితే రానున్నది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సీజన్ కావడంతో బాలయ్య కనీసం రెండు నెలలు అందుబాటులో ఉండడు అంటున్నారు. ఆ నేపథ్యంలో రిలీజ్ డేట్ మారితే సంక్రాంతి డేట్ పిక్ చేద్దామని అనుకుంటున్నారట. ఇక నాగార్జున వందో సినిమాను సంక్రాంతికే తీసుకొస్తారని టాక్. వచ్చే సంక్రాంతికి మళ్లీ కలుద్దాం అని మొన్నీమధ్యే నాగ్ అన్నారు కూడా.
మరోవైపు సంక్రాంతి అంటే దిల్ రాజు సినిమా ఉండాల్సిందే అంటుంటారు. అలా వచ్చే సంక్రాంతికి ‘శతమానం భవతి 2’ తీసుకొస్తాం అని చెప్పేశారు కూడా. అయితే వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా ప్లానింగ్‌లో ఉంది. అది ఓకే అయితే దానినే సంక్రాంతికి తీసుకొద్దాం అనుకుంటున్నారట. మరోవైపు ప్రభాస్ ‘రాజా సాబ్’ను కూడా సంక్రాంతి డేట్‌కి అంటున్నారు. మరోవైపు ‘జై హనుమాన్’ కూడా సేమ్ సీజన్ అని ప్రశాంత్ వర్మ చెప్పేశారు. దీంతో మొత్తంగా ఆరు సినిమాలు సంక్రాంతి డేట్‌తో ఉన్నాయి. మరి ఏవి ఫైనల్ అవుతాయో చూడాలి.