టాలీవుడ్‌లో కొణిదెల కుటుంబం అంటే ఫుడీస్ అని పేరు. వాళ్ల ఇంట్లో గట్టిగా తింటారు.. వాళ్లింటికి వెళ్లేవారికి కడుపు నిండేలా పెడతారు అని చెబుతారు. చిరంజీవి ఫుడ్ ఏర్పాట్ల గురించి, వంటల గురించి, కాంబినేషన్‌ల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు టాలీవుడ్‌లో. అందులో చిరంజీవి దోశ ముఖ్యమైనది. ఇది కాకుండా చాలా ఉన్నాయి వారి ఫుడ్ హిస్టరీలో. ఈ క్రమంలో రామ్‌చరణ్‌కి బాగా ఇష్టమైన ఓ ఫుడ్ కాంబో గురించి ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్‌కు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం. విదేశాలకు వెళ్లినప్పుడు ఎన్ని రకాల ఇతర దేశాల ఆహార పదార్థాలు తిన్నా.. రోజుకోసారి అయినా దక్షిణాది ఫుడ్ తినకపోతే ఊరుకోడట. ఫ్యామిలీతో బయటకు వెళ్లినా, షూటింగ్‌ల కోసం బయటకు వెళ్లినా రోజులో ఓ పూట అంటే ఉదయం టిఫిన్ కానీ రాత్రి భోజనంలో కానీ ఇంటి స్టైల్ ఫుడ్ ఉండాలట. చరణ్ ఉపాసన షూటింగ్‌ల కోసం, పర్సనల్ ట్రిప్స్ కోసం వెళ్తే.. సౌత్ ఫుడ్ ఉండేలా ముందుగానే ప్లాన్ చేసుకుంటారట.
ఇక చరణ్‌కు బాగా ఇష్టమైన ఆహారం రసం రైస్. అదేదో స్పెషల్ రసం రైస్ కాదు. మనం ఇంట్లో నిత్యం తినే రెగ్యులర్ రసం రైస్. అయితే దానికి ఆమ్లెట్ కాంబినేషన్ కచ్చితంగా ఉండాల్సిందేనట. వేడి వేడి రసం, రైస్, ఆమ్లెట్ కడుపు నిండా తినేసి హ్యాపీ అవుతాడని ఉపాసన చెప్పుకొచ్చాడు. రోజూ అదే పెట్టినా ఆనందంగా తింటాడు అని ఉపాసన తెలిపారు. .
మధ్యాహ్నం పూట కావాలంటే బయట ఎక్కడైనా తిందాం కానీ.. రాత్రి మాత్రం హోం స్టైల్ ఫుడ్ ఉండాల్సిందే అని చరణ్ అంటాడని ఉపాసన తెలిపారు. ఇంట్లో అందరూ మంచి చెఫ్‌లనీ.. పాకశాస్త్రంలో ప్రావీణ్యులని, తాను ఆ స్థాయిలో వంట చేయలేను అని ఉపాసన చెప్పారు.