ఇటీవల ఈడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పూరి , ఛార్మీ లను పిలిచి విచారించిన సంగతి తెలిసిందే. ‘లైగర్’ సినిమా నిర్మాణం విషయంలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు చాలా ఆరోపణలు ఉన్నాయి.అందుకే లైగర్ దర్శకుడు పూరికి, నిర్మాత ఛార్మీకి ఈడి కొద్ది రోజుల క్రితం నోటీసులు పంపించడం జరిగింది. కానీ ఈ విషయాన్ని పూరి టీమ్ గోప్యంగా ఉంచింది. చాలా సీక్రెట్ గా పూరి ఛార్మీతో కలిసి ప్రైవేట్ గా ఈడీ ఆఫీసుకు వెళ్లాడం, ఆ తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ జంటను ఈడీ ప్రశ్నించడం జరిగింది.
లైగర్ సినిమాకి విదేశీయులు కూడా పెట్టుబడులు పెట్టినట్టు వారికి సమాచారం అందిందని వినికిడి. వీటి పై కూడా పూరి, ఛార్మి లను ఈడి ప్రశ్నించినట్టు స్పష్టమవుతుంది. ఈ వ్యవహారంలో పూరి ఎవరెవరి పేరు బయటపెట్టాడు అనేది బయటకు రాలేదు కానీ… ఇప్పుడు విజయ్ దేవరకొండని కూడా ఈడీ విచారించబోతుంది. చాలా సీక్రెట్ గా విజయ్ దేవరకొండ ఈడి ఆఫీస్ కు హాజరయ్యాడు. లైగర్ సినిమాకి తన పారితోషికం ఎంత? సినిమాకి అంత బడ్జెట్ ఎవరు పెట్టారు? ఇందులో రాజకీయ నాయకుల హస్తం ఉందా? విదేశాల నుండి ఈ సినిమాకి పెట్టుబడులు పెట్టింది ఎవరు? ఇలాంటి విషయాల పై విజయ్ దేవరకొండని ఈడి ప్రశ్నించనుంది.
ఆగస్టు 25న రిలీజ్ అయిన లైగర్ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీకి రూ.100 కోట్ల పైగా బడ్జెట్ పెట్టినట్టు వినికిడి. ఛార్మి, పూరి లతో పాటు కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. సినిమాకి రూ.50 కోట్ల పైగా నష్టం వచ్చింది అని బయ్యర్స్ ఓ పక్క పూరీని టార్గెట్ చేసి వేధిస్తుంటే.. ఇప్పుడు ఈడి కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టినట్టు స్పష్టమవుతుంది.