విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. అతి తక్కువ కాలంలో ఆయన విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన కు ఈ రేంజ్ ఫాలోయింగ్ రావడానికి అతని సినిమాలు ఒక కారణం అయితే అతని రియల్ టైమ్ బిహేవియర్ మరో కారణం. అతని ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ రెండూ ఒకేలా ఉంటాయి. వేదికలపై కావచ్చు, ఇంటర్వ్యూలలో కావచ్చు ఆయన తనకు అనిపించింది నిరభ్యన్తరంగా చెప్పేస్తారు. ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అతని నైజం. ఈ తత్వాన్ని ఇష్టపడే వారు బోలెడు మంది ఉన్నారు.
మీడియా పై కూడా విజయ్ దేవరకొండ మండిపడిన రోజులు, బహిరంగ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ ఫలితం విషయంలో.. పనిగట్టుకొని కొందరు సినిమా పై విష ప్రచారం చేస్తున్నారని డైరెక్ట్ గా విజయ్ మాట్లాడారు. కాగా మరో మారు ఆయన మీడియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మీడియా పై తనకు ఉన్న అసహనాన్ని మొత్తం వెళ్లగక్కాడు. ‘సమాజంలో పక్కన వ్యక్తిని తొక్కి ముందుకు వెళ్లాలి అనుకునేవారు ఉన్నారు. ఎదుటి వ్యక్తి ఏమైపోయినా ఫర్వాలేదు.. నేను బాగుండాలి అనుకుంటారు. వీరు సమాజంలో ఉండటం ప్రమాదకరం. కొన్ని వెబ్‌సైట్లు విపరీతంగా వదంతులు రాస్తున్నాయి. వీరి వల్ల చాలా మంది బాధపడుతున్నారు. చిత్ర పరిశ్రమ ఇంకా ఎక్కువ బాధపడుతోంది. మనల్నే వాడి.. మనకు తప్పుడు వార్తలు అమ్మి.. వాళ్లు డబ్బులు చేసుకుంటారు. అయినా సరే ఇన్నాళ్లూ క్షమిస్తూ వచ్చా. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది’. అన్నారు
కొన్ని వెబ్సైట్లను ఉద్దేశిస్తూ… ‘ఈ నాలుగు వెబ్‌సైట్లు గత నెల రోజులుగా నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాయి. విపరీతమైన ఫేక్ వార్తలు రాస్తున్నాయి. ‘విజయ్ దేవరకొండ ఎక్కడ?, విజయ్ దేవరకొండ దాక్కున్నాడా?, విజయ్ దేవరకొండ వేదికపైకి రావాలి?..’ అని రాశారు. వీరికి నా సమాధానం.. అసలు మీరెవరు నన్ను విరాళాలు అడగడానికి. మీరు బతికేదే మా చిత్ర పరిశ్రమపై ఆధారపడి. ప్రకటనలు ఇవ్వకపోతే రేటింగ్స్ తగ్గిస్తామని బెదిరింపులు, ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే మాపై తప్పుడు వార్తలు, మీ అభిప్రాయాలు అందరిపై రుద్దుతారు. నాకు నచ్చినప్పుడు, నాకు అనిపించినప్పుడు, నాకు కుదిరినప్పుడు, నాకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికిస్తా.. మీకు కనీసం ఇంత మాత్రం జ్ఞానం లేదా..?’ అన్నారు.
ఇక విజయ్ దేవరకొండ ఇటీవల కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి నిత్యావసర అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందిపడుతున్న వారి కోసం 25లక్షల రూపాయలతో మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో ఓ ఛారిటీ సంస్థను ఏర్పాటు చేసి 2000 కుటుంబాలకు సహాయం చేయాలనుకున్నాడు. దీనికి అనూహ్య స్పందన రావడం జరిగింది. ఆ సంస్థకు పెద్ద ఎత్తున విరాళాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అందులో అవకతవకలు జరుగుతున్నాయని కొందరు వార్తలు రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియా సాక్షిగా విజయ్ దేవరకొండ సుదీర్ఘ ప్రసంగంలో అగ్నిపర్వతంలా పేలాడు.