జీరోతో మొదలై హీరోగా మారి.. ఆ తర్వాత స్టార్ హీరో అయిన వాళ్లను టాలీవుడ్‌లో కొద్దిమందినే చూస్తుంటాం. వారసత్వం హీరోలు కాకుండా.. కొత్త కుర్రాళ్లకే ఇది సాధ్యమవుతుంది. అలా కుర్ర స్టార్ హీరోగ మారిన కథానాయకుడు విజయ్ దేవరకొండ. చిన్న చిన్న పాత్రలతోనే టాలీవుడ్ ప్రయాణం ప్రారంభించినా.. ‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. దీంతో కొంతమంది అతన్ని సూపర్‌స్టార్ అని పిలుస్తున్నారు. దీనిపై తాజాగా విజయ్ దేవరకొండ స్పందించాడు.
విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘లైగర్’. ఈ సినిమా ప్రచారం ఎట్టకేలకు తెలంగాణకు చేరుకుంది. వరంగల్‌లో ఇటీవల ఫ్యాన్ డమ్ ఈవెంట్ నిర్వహించారు. ఇంచుమించు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోండి. అందులో భాగంగా విజయ్ మాట్లాడుతూ.. సినిమా గురించి, షూటింగ్ గురించి, తన గురించి, తన అభిమానుల గురించి వివరంగా మాట్లాడాడు. ఈ క్రమంలో ‘సూపర్‌స్టార్’ కామెంట్‌పై తన వెర్షన్ కామెంట్స్ చెప్పాడు.‘‘లైగర్’ సినిమా ప్రచారంలో భాగంగా.. దేశంలో చాలా ప్రాంతలకు వెళ్లాం.
ఈ క్రమంలో నేను చూడని ఎన్నో ప్రాంతాలు విజిట్ చేశాను. అక్కడి వారంతా నాపై అంత ప్రేమ ఎందుకు చూపించారో అర్థం కావడం లేదు. తెలుగు ప్రేక్షకుల వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని చెప్పాడు విజయ్. ‘లైగర్’లో హీరో, అతడి తల్లి దేశాన్ని షేక్ చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్ నుండి ముంబయి వెళ్తారు. అలా ఈ సినిమా కోసం నేను, పూరి జగన్నాథ్, ఛార్మి కలసి ముంబయి వెళ్లాం. ఏదేమైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాం’’ అని సినిమా గురించి టీమ్ పడ్డ కష్టం గురించి వివరించాడు విజయ్.
ఇకత తనను సూపర్ స్టార్ అని పిలుస్తుండటం గురించి మాట్లాడుతూ ‘‘నేనింకా చిన్న పిల్లాడినే. నన్ను సూపర్ స్టార్.. సూపర్ స్టార్ అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంది. దాని కోసం నేనింకా కష్టపడాలి’’ అని విజయ్ అన్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఒకవేళ విజయ్ సూపర్ స్టార్ అయితే.. అతని అభిమాన హీరో మహేష్‌బాబును ఏమని పిలవాలి.