మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మీరు కూడా చదివే ఉంటారు. ఏ సినిమా కూడా ఆ హీరోకో, హీరోయిన్‌కో ఫస్ట్ సినిమా అవ్వదు, ఎవరో వద్దనో, కాదనో వచ్చి ఉంటుంది అని. అయితే ఆ సమయంలోనే ఎవరికి రావాల్సిన సినిమా వారికే వస్తుంది అని కూడా వినే ఉంటారు. అలాంటి మరో సినిమా, మరో హీరో గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఐదేళ్ల క్రితం టాలీవుడ్‌లో మాస్ సినిమాల రికార్డులను బద్దలుకొట్టిన సినిమ గుర్తుందా? ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. అదేనండీ ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar).
ఆ సినిమా గురించే ఇప్పుడు చర్చంతా. ఎందుకంటే ఈ సినిమా కథ తొలుత రామ్ (Ram) దగ్గరకు రాలేదట. దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఆ కథను తొలుత విజయ్ దేవరకొండకు చెప్పారట. బాడీ లాంగ్వేజ్, యాస్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాయి అనుకొని మరీ ఆయనను హీరో చేద్దాం అనుకున్నారట ఆ కథకు. అయితే కథ విషయంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అంతగా కన్విన్స్ కాకపోవడంతో ఆ కథ ఆ తర్వాత రామ్ దగ్గరకు వెళ్లిందట. మంచి మాస్ సినిమా చేద్దామనుకుంటున్న రామ్ వెంటనే ఓకే చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
ఆ సినిమాతో ఇటు రామ్, అటు పూరి జగన్నాథ్ తిరిగి హిట్ ట్రాక్ ఎక్కారు. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా చేస్తున్నారు. మరి ఏ విషయంలో నచ్చక విజయ్ ఆ కథ వద్దనుకున్నారో ఆయనకే తెలియాలి. ఒకవేళ చేసి ఉంటే సినిమాకు, ఆయనకు ఇంకా ఎక్కువ లాభం కలిగేది అని చెప్పొచ్చు. అంతేకాదు ‘లైగర్’ (Liger) లాంటి డిజాస్టర్ చేసే ఖర్మ కూడా తప్పేది అని అంటున్నారు ఈ మాట తెలిసినప్పటి నుండి నెటిజన్లు.
‘వాట్ లగా దేంగే’ అంటూ ‘లైగర్’కి విజయ్ దేవరకొండ చేసిన హడావుడి ‘ఇస్మార్ట్ శంకర్’ చేసుంటే, దానికి ఆ స్థాయిలో సందడి చేసి ఉంటే ఈ పాటికి ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావు. ఏం చేస్తాం ఎవరికి రాసిపెట్టి ఉంటే ఆ కథ వారి దగ్గరకు వెళ్తుంది మరి.