అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ తెలంగాణ పవర్ స్టార్ అనే బిరుదు దక్కించుకున్నారు. అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడి తెలంగాణ వాసుల అభిమాన హీరో అయ్యారు. ఆ తర్వాత అతను హీరోగా నటించిన ట్యాక్సీ వాలా, గీత గోవిందంలోనూ తెలంగాణ హీరోగానే కనిపించనున్నారు. అయితే ఆ తర్వాత చేయనున్న సినిమాలో మాత్రం ఆంధ్ర యువకుడిగా అదరగొట్టనున్నారు. శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారు బిగ్ బెన్ బ్యానర్స్‌తో కలిసి విజయ్ దేవర కొండ హీరోగా సినిమా చేస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి “డియర్ కామ్రేడ్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం కాకినాడ లో షూటింగ్ జరుపుకోనుంది. అక్కడి కాలేజీలో యూనియన్ లీడర్ గా విజయ్ సమ్మెలు, ధర్నాలు చేయనున్నారు. అలాగే ప్రేమలోనూ పడనున్నారు. పూర్తిగా కాలేజీ నేపథ్యంలో సాగే ఈ మూవీలో విజయ్ గోదావరి యాసలో మాట్లాడనున్నారు. తెలంగాణ యాసను అద్భుతంగా పలికించే ఈ నటుడు గోదావరి యాసలో ఎలా మాట్లాడుతాడా? అని అందరిలో ఆసక్తి నెలకొంది. అందులో శిక్షణకూడా తీసుకున్నట్టు తెలిసింది. గోదావరి యాసలో మాట్లాడాలి మెప్పిస్తే ఆంధ్ర వాసులకు సైతం అభిమాన హీరో అయిపోతారు.