ఈ ఇన్నింగ్స్‌లో విజయ్ ఆఖరి సినిమా అని చెబుతున్న 69వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్ మీడియా హల్‌చల్ చేస్తోంది. నిజానికి అది కోడంబాక్కం వర్గాల నుండి వచ్చిన మాటే. అదే ఆ సినిమా ఓ తెలుగు సినిమాకు రీమేక్ అని. ఈ విషయం దర్శకుడు ఓ సారి క్లారిటీ ఇచ్చినా.. ఇప్పుడు అది బూడిదలో పోసిన పన్నీరే అయిపోయింది. దానికి కారణం వీటీవీ గణేశ్.
Vtv Ganesh
ఆయన లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేశ్ – ఐశ్వర్య రాజేశ్ – మీనాక్షి చౌదరి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లాంటి మ్యూజికల్ నైట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీటీవీ గణేశ్ మాట్లాడుతూ ‘భగవంత్ కేసరి’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. అనిల్ సినిమా కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకున్నారంతా.
ఇంతలో ఆ సినిమాను విజయ్ ఐదుసార్లు చూశారు అనే మాట చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ సినిమా అనిల్ రావిపూడిని పిలిపించి రీమేక్ చేయమని కోరితే సున్నితంగా తిరస్కరించి వచ్చారని చెప్పుకొచ్చారు. అంతగా నచ్చేలా అనిల్ ఆ సినిమా చేశారని వీటీవీ గణేశ్ చెప్పారు. దీంతో విజయ్ చేస్తున్న నెక్స్ట్ సినిమా అదే అంటూ చర్చ మొదలైంది.
అయితే అనిల్ రావిపూడి ఎంతగా వీటీవీ గణేశ్ సర్దిచెప్పి టాపిక్ డైవర్ట్ చేద్దామని చూసినా గణేష్ వినలేదు. అనుకున్నది చెప్పేశారు. ఇప్పుడు ఈ వీడియో మొత్తంగా వైరల్‌గా మారింది. అయితే అనిల్ రావిపూడి ఆ తర్వాత క్లారిటీ ఇస్తూ విజయ్‌ను కలిసిన మాట వాస్తవమే కానీ అది వేరే విషయం గురించని ఏదో చెప్పబోయారు. ఆ సినిమా గురించి ఆ టీమ్ అనౌన్స్ చేస్తేనే బెటర్ అనేలా చెప్పారు.
ఈ నేపథ్యంలో విజయ్ సినిమా గురించి అర్జెంట్‌గా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నిర్మాణ సంస్థకు వచ్చింది. మరి క్లారిటీ ఇస్తారో లేక వదిలేస్తారో చూడాలి. ఇప్పటికైతే ఓసారి దర్శకుడు హెచ్.వినోద్ రీమేక్ కాదు అనే క్లారిటీ లాంటిది ఒకటి ఇచ్చారు.