తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తుందా?.. అవార్డ్ వరకు ఎందుకులే కానీ అసలు ఆస్కార్‌కి నామినేట్ అవుతుందా?.. ఈ మాటలు ఎవరితోనైనా అంటే.. ‘‘ఏంటి జోకా?.. అది కలలో కూడా జరుగదు’’ అనేసేవారు.. కానీ ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమా ఆస్కార్ సాధించింది.. టాలీవుడ్ సినిమాని పాన్ ఇండియా లెవల్‌కి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. ఇప్పుడు తెలుగు పాటకి అకాడమీ అవార్డ్ తెచ్చిపెట్టారు.. ఇది అపూర్వ ఘట్టం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పర్వం..
ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాకి కలగానే మిగిలిపోయిన ఆస్కార్ (2023) ని ట్రిపులార్ సాకారం చేసింది.. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను కొల్లగొట్టి.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వపడుతున్నారు.. స్వరవాణి కీరవాణి సంగీతం, ప్రముఖ రచయిత చంద్రబోస్ సాహిత్యం, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ గాత్రం.. వీటి గురించే అందరూ మాట్లాడుతున్నారు.. వీరినే అందరూ ప్రశంసిస్తున్నారు.. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.. రాహుల్, కాల భైరవ ఆస్కార్ వేదికమీద ఈ సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం..
కీరవాణితో కలిసి చంద్రబోస్ వేదికనెక్కడం చూశాం.. కానీ ‘నాటు నాటు’ కి ఎంతో క్లిష్టమైన స్టెప్పులను ఇష్టంగా తీర్చిదిద్దిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గురించి మాట మాత్రం మాట్లాడడం లేదు.. దీని గురించే ఫిలిం వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ చర్చ జరుగుతోంది.. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్నప్పుడు కీరవాణి కూడా ప్రేమ్ రక్షిత్ పేరు ఏదో చెప్పాలి అన్నట్టు చెప్పారని.. రాజమౌళి ఒకటీ, రెండు సార్లు చెప్పినా పెద్దగా గుర్తు పెట్టుకుని చెప్పలేదని..
గతంలో ‘యమదొంగ’ లోని ‘నాచోరే నాచోరే’ పాటలో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రేమ్ రక్షిత్ వేయించిన స్టెప్స్ గురించి ప్రశంసించిన వారు ఇప్పుడెందుకు పట్టించుకోవడం లేదు? .. ఆ పాటకు సోలోగా ఆయనకు పలు అవార్డులొచ్చాయి.. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కీరవాణి, రాజమౌళి.. ప్రేమ్ రక్షిత్ పేరు చెప్పకపోవడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుందా?’’ ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ రాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..