ఒకపక్క థియేటర్లను కాపాడండి, థియేటర్లలో మాత్రమే సినిమాలు రిలీజ్ చేయండి అని నిర్మాతలు మొత్తుకుంటున్నారు. మొన్నామధ్య నాని “టక్ జగదీష్”ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చేసిన హడావుడి గురించి తెలిసిందే కదా. అయితే.. ఇప్పుడు వెంకటేష్ తన తాజా చిత్రం “దృశ్యం 2″ను డైరెక్ట్ ఒటీటీ రిలీజ్ కు ప్లాన్ చేస్తుండడం మళ్ళీ చర్చలకు దారి తీసింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి తోటి సీనియర నటులందరూ తమ చిత్రాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో..
వెంకీ మాత్రం సైలెంట్ గా ఒటీటీలో తన రెండో చిత్రాన్ని రిలీజ్ చేయనుండడం ప్రశ్నార్ధకంగా మారింది. మలయాళ వెర్షన్ ఒటీటీలో రిలీజ్ అయ్యింది కాబట్టి, తెలుగు వెర్షన్ కూడా ఒటీటీలోనే రిలీజ్ చేయాలని కొందరు అభిప్రాయపడుతున్నప్పటికీ.. పెద్ద హీరోల సినిమాలు. అది కూడా వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో సినిమాను ఒటీటీలో రిలీజ్ చేయడం అనేది ఒకరకంగా మంచిది కాదని ఇంకొందరు చెబుతున్నారు. ఏదేమైనా “దృశ్యం 2” లాంటి కంటెంట్ ఉన్న సినిమా డైరెక్ట్ ఒటీటీ కంటే థియేటర్లలో రిలీజవ్వడం సబబు.
సో, వెంకీ మామ ఈ విషయంలో మరోసారి ఆలోచించి థియేటర్ల వైపు జనాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడని ఆశిద్దాం. ఇకపోతే.. వెంకీ మామ నెట్ ఫ్లిక్స్ కోసం చేయనున్న “రాణా నాయుడు” షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవ్వనుంది. ఈ సిరీస్ లో రాణా-వెంకీ తండ్రీకొడుకులుగా నటించనున్న విషయం తెలిసిందే.