పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అనే వ్యక్తి పేరే ఒక సంచలనం. అటు నటుడిగా, ఇటు రాజకీయ నాయకుడిగా తన సత్తాను ఘనంగా చాటుకొని ఢిల్లీ దాకా తన పేరు వినిపించేలా చేసుకున్నాడు. స్వయంగా నరేంద్ర మోడీ పవన్ చేయి పట్టుకొని చిరంజీవి (Chiranjeevi) దగ్గరకు తీసుకెళ్లడం, పార్లమెంటులో పవన్ కల్యాణ్ ఓ తుఫాన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించడం వంటివి పవన్ కళ్యాణ్ స్థాయిని వివరించేందుకు దోహదపడే మచ్చుతునకలు. ఆ పవన్ కళ్యాణ్ పేరు నిన్న రాత్రి అమితాబ్ హిందీలో నిర్వహించే “కౌన్ బనేగా కరోడ్ పతి” షోలో వినిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
Pawan Kalyan
షోలో 1,60,00 రూపాయల ప్రశ్నగా “ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీయంగా ప్రమాణ స్వీకారం చేసిన నటుడు ఎవరు?” వచ్చింది. అందుకు సమాధానంగా ఓ వృద్ధ జంట ఆడియన్స్ పోల్ ఆధారంగా “పవన్ కల్యాణ్” అంటూ కరెక్ట్ గా చెప్పడం, వెంటనే అమితాబ్ జనసేన పార్టీ గురించి వివరించి, పవన్ కల్యాణ్ ఎవరో కాదని చిరంజీవి తమ్ముడు అని పేర్కొనడం భలే ముచ్చటగా అనిపించిన విషయం.
భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ పేరు ఆయన జీవితం పాఠ్యాంశాలుగా కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఇకపోతే.. పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 23 నుండి “హరిహర వీరమల్లు” (Hari Hara Veera Mallu) సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయ్యాక ఆయన “ఓజీ” (OG Movie) షూటింగ్ కి డేట్స్ ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ “హరిహర వీరమల్లు & ఓజీ” చిత్రాలు వచ్చే ఏడాది విడుదల చేయాలని దర్శకనిర్మాతలు దృఢంగా సంకల్పించుకున్నారు.
మరి ఆ సంకల్పానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) షెడ్యూల్ కూడా సహరిస్తే ఆయన అభిమానులు ఒకే ఏడాది రెండు సినిమా రిలీజులను ఎంజాయ్ చేసే వరం దొరికినట్లే. అయితే.. “హరి హర వీరమల్లు” చిత్రం నుండి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) తప్పుకొని.. ఇప్పుడు ఆ చిత్ర దర్శకత్వ బాధ్యతలను “ఆక్సిజన్ (Oxygen), రూల్స్ రంజన్ (Rules Ranjann)” ఫేమ్ జ్యోతికృష్ణ (A. M. Jyothi Krishna) తీసుకోవడం మాత్రం పవన్ కల్యాణ్ అభిమానుల్ని కంగారుపెడుతున్న విషయం.