కొన్ని సినిమాలు రీరిలీజ్ అయితే అభిమానులు సంబరం చేసుకుంటారు. మరికొన్ని సినిమాలు రీరిలీజ్ అయితే ప్రేక్షకులు ఆనందపడతారు. కానీ రీ రిలీజ్ అయితే ఏకంగా సినిమా పరిశ్రమ సంబరం చేసుకుంటుంది. అలాంటి వాటినికి క్లాసిక్ అని చెప్పొచ్చు. మన సినిమా పరిశ్రమ స్థాయిని పెంచిన సినిమాలు అవి. అలాంటి ఓ సినిమా ఈ సమ్మర్‌లో రాబోతోంది. తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా, తొలి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ సినిమాగా ఆ సినిమా రికార్డులకెక్కింది.
అదే ‘ఆదిత్య 369’ (Aditya 369). నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా… సింగీతం శ్రీనివాసరావు (singeetam srinivasa rao) దర్శకత్వంలో రూపొందిందిన సినిమా ఇది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను నేటి సాంకేతికతకి తగ్గట్టుగా 4K డిజిటల్ హంగులద్ది రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ వేసవిలో సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. 1991లో వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు అంటే 34 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తోందన్నమాట. ఎన్నిసార్లు చూసినా ప్రేక్షకులకు కనువిందు చేసే ట్రెండ్ సెట్టర్ సినిమా ‘ఆదిత్య 369’.
ప్రత్యేక ఆసక్తితో ఈ సినిమాను మరోసారి విడుదల చేస్తున్నా అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. తెలుగు పరిశ్రమలోనే కాదు దేశంలోనే మొట్ట మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఆదిత్య 369’. బాలకృష్ణ కెరీర్‌లో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన కూడా ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని చాలా ఏళ్లుగా చెబుతూ వస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో సినిమా చేయాలని ముచ్చటపడుతున్నారు. ఎందుకో కానీ ఆ సినిమా ఇంకా పట్టాలెక్కడం లేదు.
ఈ ఏడాది, వచ్చే ఏడాది అంటూ చాలా ఏళ్లు గడిచిపోయాయి. సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను తొలుత కమల్ హాసన్‌తో అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. శ్రీ కృష్ణదేవరాయల పాత్రకు బాలకృష్ణ సూటవుతారని ఆయనతో సినిమా చేశారు. అలా 1991 ఆగస్ట్ 18 విడుదలైన ఈ సినిమా రికార్డులు, రివార్డులు, వసూళ్లతో అదరగొట్టింది. ఈ సినిమా అప్పట్లో ఓ అద్భుతం. ఆ మాటకొస్తే ఇప్పటికీ అద్భుతమే.