మామూలుగా టాలీవుడ్‌లో ఓ మాట అంటూ ఉంటారు. ఫ్యామిలీ జోనర్ సినిమాలు వీకెండ్‌లో బాగా ఆడతాయని, మాస్ సినిమాలు వారం మొత్తం ఆడతాయని. ఈ మాట అన్నిసార్లూ కరెక్ట్ కాదు అని నిరూపించింది ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) . క్రింజ్ కామెడీ అంటూ సినిమాను తక్కువ చేయాలని చూసినా.. ప్రమోషన్స్‌ని, ప్రేక్షకుల ఎమోషన్స్‌ని నమ్ముకున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) అండ్ దిల్ రాజు (Dil Raju) సినిమాను జనాల్లోకి బాగా తీసుకెళ్లారు. ఇప్పుడు జనాలు తెగ వస్తున్నారు.
Balakrishna, Venkatesh
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఇప్పటివరకు రూ. 275 కోట్లకుపైగా వసూలు చేసిందని టీమ్ చెబుతోంది. పోస్టర్లు, అందులోని వసూళ్ల లెక్కల మీద నమ్మకం లేకపోయినా (కారణం నిర్మాతలు గతంలో ఇచ్చిన క్లారిటీలే) థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు, జనాలు చూస్తే సినిమా భారీ విజయం సాధించింది అని చెప్పొచ్చు. దీంతో ఓ ఫ్యామిలీ జోనర్ సినిమాకు ఇంత వసూళ్లు ఎలా అనే చర్చ మొదలైంది. ఎందుకు సినిమాను ప్రేక్షకులు తెగ చూస్తున్నారు?
ఈ ప్రశ్నకు సమాధానం ఈ సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో ఒకటి మాత్రమే అందరూ చూసే ఉండటం. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉండటం. ఈ కారణం చేతనే ప్రేక్షకులు రిపీట్‌లో కూడా చూస్తున్నారని ట్రేడ్ వర్గాల టాక్. అంటే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కానీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సరైన పోటీ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. ‘గేమ్ ఛేంజర్’ కంటెంట్ కారణంగానో, టీమ్ చెబుతున్న కుట్ర కారణంగానో తొలి షో నుండే ఇబ్బందిపడింది.
ఇక ‘డాకు మహారాజ్’ సినిమాకు తొలి షో నుండి కాస్త పాజిటివ్ రెస్పాన్సే ఉండింది. బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాస్ మేనరిజమ్స్, ఎలివేషన్లతో సినిమా బాక్సాఫీసును దబడి దిబిడి ఆడిస్తాది అని అన్నారు. కానీ ఆ జోరు కనిపించలేదు. ఈ రెండు కారణాలు కూడా వెంకటేశ్ (Venkatesh Daggubati) ఈసారి హవా చూపించడానికి కారణమయ్యాయి అని చెబుతున్నారు. ఏదైతేనేం గతేడాది ‘సైంధవ్’గా వచ్చి ఇబ్బంది పడ్డ వెంకీ ఈ సారి అదరగొట్టారు.