కొన్ని సినిమాలకు సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయి అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. దానికి కారణం వచ్చిన తొలి పార్టు సాధించిన విజయం మాత్రమే కాదు.. ఆ సినిమా ఆ హీరో కెరీర్‌లో తీసుకొని ఇంపాక్ట్ కూడా. అలాంటి ఓ సినిమా ‘లూసిఫర్’. మోహన్‌లాల్ (Mohanlal) ఇలాంటి పాత్రలు చేయడం కొత్త కాదు కానీ.. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) మోహన్‌లాల్‌ను చూపించిన విధానం ఆయన అభిమానులకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. నిన్న టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు.
L2E Empuraan
తొలి పార్టులా కాకుండా ఈసారి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో టీజర్‌ను ‘ఎల్ 2 ఎంపురాన్’ (L2E Empuraan) టీమ్ రిలీజ్ చేసింది. అయితే అన్నీ ఒకే వీడియోలో పెట్టేసింది. సెట్టింగ్స్‌లో ఆడియో ట్రాక్ మార్చి చూసుకునేలా పెట్టింది. దీంతో చాలామంది తెలుగులో టీజర్ వచ్చింది అనే విషయమే తెలియలేదు. ఇక టీజర్ సంగతి చూస్తే.. క్లూస్ తక్కువ ఇచ్చినా క్వాలిటీ కంటెంట్‌తో అదరగొట్టారు అని చెప్పాలి.
‘లూసిఫర్’ సినిమాలో కూలిపోయిన రాజకీయ సామ్రాజ్యాన్ని నిలబెడతాడు స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్ లాల్). అతడు విదేశాల్లో మాఫియా డాన్ అని సినిమాలో చెబుతారు కూడా. ఇప్పుడు ఈ సినిమాలో ఆ డాన్ చేసే పనులు, సాయాలు కనిపిస్తాయి. అబ్రహం ఖురేషిని పట్టుకోవడానికి అంతర్జాతీయ సంస్థలు ఏం చేశాయి. వాటిని ఆయన ఎలా తిప్పి కొట్టాడు అనేదే కథ. అలాగే తన కుటుంబానికి కేరళలో మళ్లీ సమస్య వస్తే ఏం చేశాడు అనేది కూడా చూపిస్తారు.
పైన చెప్పినట్లు విజువల్స్, కంటెంట్ భారీగా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మార్చి 27 వరకు ఆగాల్సిందే. “ఏదో ఒకరోజు నీ చుట్టూ ఉన్న వాళ్లంతా మోసగాళ్లు అనిపించినప్పుడు.. ఈ నాన్న లేకుంటే.. నిన్ను ఆదుకోగలిగినవాడు ఒక్కడే ఉంటాడు. అతడే స్టీఫెన్” అంటూ ఎలివేషన్ డైలాగ్ కూడా ఇందులో ఉంది.