తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబులు తొలి తరం హీరోలుగా పేరుగాంచారు. రెండో తరం స్టార్లుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నిలిచారు. వీరు దాదాపు 20 ఏళ్లపాటు సినీ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మూడో తరం యువనటుల హవా కొనసాగుతోంది. ఈ సమయంలో కూడా చిరు, బాలయ్య, నాగ్, తమదైన స్టయిల్ తో ఆకట్టుకోవడానికి శ్రమిస్తున్నారు. వినూత్న కథలతో మన ముందుకు రాబోతున్నారు.
సామాజిక కోణంలో..మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్తిస్థాయిలో సినిమాలో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఎప్పుడూ సమాజానికి ఉపయోగపడే కథల్లో నటించడానికి ఇష్టపడే చిరు ఈ సారి కూడా ఓ సామాజిక అంశాన్ని కథగా ఎంచుకున్నారు. తన 150 వ చిత్రం “కత్తిలాంటోడు” లో రైతుల బాగుకోసం పోరాడే నాయకుడిగా అలరించనున్నారు. ఈ సినిమాని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తుండగా.. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది.
చారిత్రిక కథనటసింహ నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాకు ఒక చారిత్రాత్మక కథను ఎంచుకున్నారు. క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన రాజు జీవితకథ ఆధారంగా రాసుకున్న “గౌతమి పుత్ర శాతకర్ణి” సినిమాలో నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ ఈ చిత్రాన్ని భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మొరాకో, హైదరాబాద్ లో రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మూడో షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లారు.
భక్తి రస చిత్రంహ్యాట్రిక్ విజయానందంలో ఉన్న కింగ్ నాగార్జున మరోసారి భక్తి రస చిత్రంలో నటిస్తున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో “ఓం నమో వెంకటేశా” చిత్రీకరణ గత శనివారం మొదలైంది. అన్నపూర్ణ స్టూడియో లో వేసిన ప్రత్యేక సెట్లో షూటింగ్ మొదలైంది. ఇందులో నాగార్జున వెంకటేశ్వరుని భక్తుడు హాథిరామ్ బాబా గా కనిపించనున్నారు.
ఇలా బిగ్ స్టార్లు విభిన్న కథలను ఎంచుకుని తమ అభిమానులను అలరించడానికి ఉత్సాహంగా పనిచేస్తున్నారు.