చాలా రోజుల క్రితం అనుకుంటా… ఓసారి దర్శకుడు బోయపాటి శ్రీనుని ఓ మీడియా ప్రతినిధి ఇలా అడిగారు ‘రౌడీలేంటండీ బంతుల్లో గాల్లో ఎగురుతున్నారు మీ హీరో కొడితే’ అని. దానికి ఆయన ఓ లాజిక్ చెప్పారు. అది కన్విన్సింగ్‌గా లేకపోయినా ‘ప్రెస్ మీట్ గౌరవం’ అనే మాటతో ఆయన ఊరుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని రోజులకు అదే బోయపాటిని మరో మీడియా ప్రతినిధి ఇంకో మాట అడిగారు ‘అంత రక్తపాతం మీ సినిమాల్లో ఎందుకు?’ అని. దానికీ బోయపాటి నుండి అదే ఆన్సర్.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… పై రెండూ జరిగి చాలా రోజులైంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇలాంటి ప్రశ్ననే బోయపాటికి మళ్లీ ఎదురైంది. ఇప్పుడు కూడా ఆయన కన్విన్సింగ్‌కి ఎలాంటి ఆస్కారం లేకుండా సమాధానం ఇచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే… అడిగే ప్రశ్న లాజిక్ గురించి అయితే… ఆయన ఆన్సర్ కూడా అదే లాజిక్ లేకుండా వస్తోంది కాబట్టి. ఆయన లేటెస్ట్ చిత్ర రత్నం ‘స్కంద’. ఈ సినిమాలో చాలా లాజిక్‌లు మిస్ అయ్యాయనే విషయం అందరికీ తెలిసిందే.
అందులో ఒకటి ఒక రాష్ట్రం సీఎం, ఇంకో రాష్ట్ర సీఎంకు తెలియకపోవడం ఏంటి? సీఎంలు పరిపాలన వదిలేసి అదేపనిగా ఇళ్లలో కూర్చుని ఉండటం ఏంటి అని? ఈ మాటలే ఆయన దగ్గర ప్రస్తావిస్తే… ‘సినిమా అన్నాక ఇలానే ఉంటుంది. అయితే సినిమాకు లాజిక్ ఏంటి?’ అనే ప్రశ్నను సమాధానంగా ఇచ్చారట. అందులోనూ కమర్షియల్ సినిమాలకు అస్సలు లాజిక్‌లు ఉండక్కర్లేదు అని కూడా అన్నారాయన.
‘‘నిజ జీవితంలో లవర్స్ కానీ, భార్యాభర్తలు కానీ రోడ్ల మీద పాటలు పాడుకుని, డ్యాన్సులు వేస్తారా?. లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఇది జరగదు. అలాగే సినిమాల్లో మిగిలిన విషయాలు కూడా’ అంటూ లాజిక్ చెప్పారు. డ్యాన్స్‌లు వేయరు అనేది ఒకప్పటి మాట… ఇప్పుడు ప్రీవెడ్డింగ్ షూట్‌లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లు అంటూ ఇప్పుడు డ్యాన్స్‌లు వేస్తున్నారు. మరి (Boyapati Srinu) ఆయన సినిమాల్లోలా రౌడీలు గాల్లో ఎగరడం లేదుగా బయట.