ఆగష్టు 30 న.. అంటే మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ‘సాహో’ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ‘బాహుబలి2’ తరువాత సుమారు రెండేళ్ళ తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడం…. అందులోనూ 350 కోట్ల బడ్జెట్ తో ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం, అలాగే టీజర్, ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతుంది.
అయితే భారీ బడ్జెట్ చిత్రం కావడంతో టికెట్ రేట్లు పెంచేశారు. అయితే ఈ విషయం పై ఈ సినిమాపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ‘సాహో’ చిత్రానికి 100 రుపాయలకు పైగా టికెట్ ధరను వసూలు చేయకూడదంటూ… దీని పై థియేటర్ యాజమాన్యాలను నియంత్రించాలంటూ… ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయాలనీ ఆ పిటిషన్లో ఉంది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత దిల్ రాజు ఇద్దరినీ ప్రతివాదులుగా చేర్చినట్లు సమాచారం. ‘సాహో’ చిత్రానికి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి.. వీకెండ్ వరకూ టికెట్లు చాలా వరకూ బుక్ అయిపోయాయి. ఈ చిత్రానికి మొదటి రోజు 100 కోట్ల వరకూ గ్రాస్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసు నమోదుకావడం చిత్ర యూనిట్ కు పెద్ద షాకిచ్చే అంశం అనే చెప్పాలి.