‘రాజా ది గ్రేట్’ టు ‘క్రాక్’ మధ్యలో 4 డిజాస్టర్లను మూటకట్టుకున్నాడు రవితేజ. అందులో ‘నేల టిక్కెట్’ మూవీ కూడా ఒకటి. టైటిల్ లో మంచి మాస్ ఉంది. ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి సూపర్ హిట్లను అందుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చి టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్పాడు. ఇవి చాలవా సినిమా కమర్షియల్ హిట్ అవ్వడానికి..! కానీ ఫలితం తేడా కొట్టింది.
కళ్యాణ్ కృష్ణకి హ్యాట్రిక్ మిస్ అయ్యింది.అలాగే రవితేజ కూడా ప్లాప్ నుండీ బయటపడలేకపోయాడు. ఫుల్ రన్లో ఈ చిత్రానికి రూ.10 కోట్ల షేర్ కూడా నమోదు కాలేదు. అటు దర్శకుడి ఇమేజ్ కానీ మాస్ మహారాజ్ ట్యాగ్ లైన్ ధరించిన రవితేజ ఇమేజ్ కానీ ఈ చిత్రాన్ని గట్టెక్కించలేకపోయాయి. తాజాగా ఈ చిత్రం ఫలితాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.
‘బంగార్రాజు’ చిత్రం సక్సెస్ సాధించిన సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్లలో భాగంగా అతను ‘నేల టిక్కెట్’ ఫలితం గురించి మాట్లాడాడు. అతను మాట్లాడుతూ.. ” ‘నేల టిక్కెట్’ ప్లాప్ అవ్వడానికి కారణం నేనే..! ఆ టైములో నేను రిలీజ్ టైంని మాత్రమే దృష్టిలో పెట్టుకుని కంగారులో సినిమాని పూర్తి చేశాను. నేను కాస్త ఫోకస్ పెట్టి చేసుంటే దాని ఫలితం మరోలా ఉండేది.
ఆ సినిమా ప్లాప్ అయినా రవితేజ గారు నన్ను ఏమీ అనలేదు. ఈ మధ్యనే ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ చేస్తుంటే కలిసాను… చాలా ఆప్యాయంగా ‘రారా’ అంటూ పలకరించారు. కుదిరితే ‘ఒకసారి ఇంటికొచ్చి కలువు’ అన్నారు. ఆయన్ని చూస్తే నాకు గిల్టీగా అనిపించింది. కుదిరితే ఆయనతో ఓ హిట్ సినిమా తీయాలని ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.