మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు అంటే.. దర్శకుడిగా చాలా పేర్లు వినిపించాయి. సీనియర్ దర్శకులు, కుర్ర దర్శకులు ఇలా కొంతమంది పేర్లు చక్కర్లు కొట్టాయి. ఒకరిద్దరు పేర్లు ఫైనల్ అయినా.. ఆఖరిలో తప్పుకున్నారు/తప్పించారు. ఆఖరికి కెప్టెన్‌గా మోహన్ రాజా వచ్చారు. అయితే ఆయన ఎలా ఈ సినిమాలోకి వచ్చారు అనేది ఇప్పటివరకు అధికారికంగా తెలియదు. తాజాగా ఈ విషయాలను ఆయనే అధికారికంగా ప్రకటించారు. అన్ని సినిమాల కథలు రాసినట్లు ‘లూసిఫర్’ను రాయలేం.
నటుడి స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని కథ, స్క్రీన్‌ప్లే, సన్నివేశాలను ఈ సినిమా కోసం రాసుకున్నారు. లెజెండ్ స్టేటస్ ఉన్న కథానాయకులు మాత్రమే ఇలాంటి కథను మోయగలరు. దేశంలో అలాంటి నటులు ముగ్గురో నలుగురో మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో చిరంజీవిగారు ఒకరు. ఇది ఆయనకు సరైన కథ అని అన్నారు మోహన్‌రాజా. అంతేకాదు రాబోయే 10 ఏళ్లలో చిరంజీవి నుండి చాలా మంచి సినిమాలు వస్తాయని అని చెప్పిన ఆయన.. చిరంజీవిలో అలాంటి ఉత్సాహం కనిపించింది అని చెప్పారు. ‘‘ధృవ’ సినిమా చేస్తున్నప్పటి నుండి రామ్‌చరణ్‌తో మోహన్‌రాజాకు పరిచయం ఏర్పడిందట.
ఆ సినిమా గురించి, మిగిలిన సినిమాల గురించి ఇద్దరూ మాట్లాడుకునేవారట. తమిళంలో ‘తనిఒరువన్ 2’ కథను సిద్ధం చేసి ఆ విషయాన్నిచరణ్‌కు చెప్పడానికి ఓసారి వచ్చారట మోహన్‌రాజా. అక్కడికి కొద్ది రోజుల తర్వాత ఓరోజు రామ్‌చరణ్ నుండి మోహన్‌రాజాకు ఫోన్ వచ్చిందట. ‘రాజా.. ‘తనివరువన్ 2’ గురించి తర్వాత చూద్దాం. తెలుగులో ‘లూసిఫర్’ రీమేక్ చేస్తారా అని అడిగారట. అలాంటి అవకాశాన్ని, ఆఫర్‌ను మోహన్‌రాజా అస్సలు ఊహించలేదట.
అప్పటికే ఒకసారి ‘లూసిఫర్’ చూసినప్పటిఒకీ.. చిరంజీవితో సినిమా అవకాశం అన్నాక మరోసారి చూశారట. ఆయనకు సరిపోయే కథ అనిపించిందట. ఆ తర్వాత చిరంజీవిని కలిసినప్పుడు కథలో చిన్న చిన్న మార్పులు చెప్పారట. అవి ఆయనకు నచ్చడంతో ముందుకెళ్లారట. అలా ఈ సినిమాలోకి మోహన్‌రాజా వచ్చారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమాను విజయదశమి కానుకగా అక్టోబరు ఐదున విడుదల చేస్తున్నారు.