ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంటారు కొంతమంది హీరోలు. వాళ్లు మినిమం గ్యారెంటీ హీరోలు కావడంతో, వసూళ్లు కూడా ఫర్వాలేదనిపిస్తుంటాయి. అలాంటివారిలో నాని ఒకరు. అయితే ఆయనకు ఇటీవల అన్నీ విజయం, డబ్బు, పేరు అందించిన సినిమాలే అనుకోండి. అయితే నాని ఆలోచన తాజాగా మారింది అని తెలుస్తోంది. కొన్ని రోజుల వరకు కొత్త సినిమాల ఆలోచనే చేయకూడదు అనుకుంటున్నారట. ఇంతకీ ఏమైందంటే… నాని కెరీర్‌ను ఇప్పటివరకు చూసుకుంటే…
పెద్దగా బ్రేక్ తీసుకున్నట్లు కనిపించడు. ఒకటి తర్వాత ఇంకొకటి కాన్సెప్ట్‌లోనూ పని చేయడు. ఒకేసారి సెట్స్ మీద రెండు సినిమాలున్న సందర్భాలూ చాలా ఉన్నాయి. అయితే నాని ఆలోచనలను కరోనా మార్చేసిందట. ప్రస్తుతం నాని మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అన్నీ వివిధ దశల్లో ఆగిపోయాయి. అన్నింటికీ కరోనానే కారణం. దీంతో ముందు వీటిని పూర్తి చేశాకే కొత్త సినిమాలు ఓకే చేయాలని చూస్తున్నాడట. అంతేకాదు అప్పటివరకు కథలు కూడా వినకూడదు అని నిర్ణయించుకున్నాడట.
నాని సినిమాలు చూస్తే… ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ రాకపోయుంటే ఈ పాటికి సినిమా విడుదలైపోయి నాని ఫ్యాన్స్ టక్ చేసుకుంటూ తిరగేవారు. అది కాకుండా ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి…’ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అంటే ఈ రెండూ పూర్తయ్యాక కానీ నాని కొత్త సినిమాల వైపు ఆలోచించేది లేదట. మరోవైపు నానికి వేణు శ్రీరామ్ ఓ కథ చెప్పారట. దాంతోపాటు ఓ కొత్త దర్శకుడు కూడా లైన్‌లో ఉన్నాడట. మరి ఈ ఇద్దరూ హోల్డ్‌లో ఉన్నారా.. లేక తర్వాత చూద్దాం అన్నాడా అనేది తెలియడం లేదు.