తెలుగు సినిమా ప్రపంచ పటంలో ప్లేస్ దక్కించుకుంటుందని.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ గుర్తింపు తెచ్చుకుంటుందని.. తెలుగు వారి ప్రతిభ గురించి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తారని.. తెలుగు నటీ నటులు, సాంకేతిక నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, గుర్తింపు దక్కుతుందని కానీ.. ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్తామని.. గోల్డెన్ గ్లోబ్‌తో పాటు హాలీవుడ్ నుండి ఇతర పురస్కారాలు మనమెవరం కూడా ఊహించి ఉండం..
కానీ.. మన ఊహల్ని నిజం చేస్తూ.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించి.. తెలుగు సినిమా సత్తా ఇదీ అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పారు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. సినిమా సినిమాకీ అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు సినిమాలను రూపొందిస్తూ.. ‘మీరు ఈ సన్నివేశాన్ని ఎలా తీశారు?’ అని వరల్డ్ ఫేమస్ దర్శకులను ఆశ్చర్యపోయేలా చేశారు. కొద్ది రోజులుగా ట్రిపులార్ మూవీ టీం అంతా విదేశాల్లో సందడి చేశారు. అక్కడ పలు పురస్కారాలు వీరిని వరించాయి..
జేమ్స్ కామోరూన్ లాంటి పాపులర్ డైరెక్టర్.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ గురించి వివరించి చెప్తూ.. రాజమౌళిని ప్రశంసించడం చూశాం.. ఎంతో మంది టెక్నికల్‌గా హాలీవుడ్‌నే తలదన్నేలా తీశారు అనే నిజాన్ని ఒప్పుకున్నారు.. తాజాగా హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఈ చిత్రం గురించి స్పందించారు.. రాజమౌళితో వీడియో కాల్ మాట్లాడారాయన.. అంతకు ముందే వీరు ఓ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్‌లో కలిశారు.. రీసెంట్‌గా యూట్యూబ్ లైవ్ ద్వారా స్టీవెన్ స్పీల్‌బర్గ్, రాజమౌళి ఇద్దరూ తమ అభిరుచులతో పాటు సినిమాల గురించి మాట్లాడుకున్నారు..
స్పీల్‌బర్గ్.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రశంసించడం, ప్రతి ఒక్క సన్నివేశం గురించి వివరిస్తూ పొగడడం.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు తమ నటనతో వారి క్యారెక్టర్లకు వన్నె తెచ్చారని చెప్పడం అనేది చిన్న విషయం కాదు.. ఇక స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ని కలిసిన విషయంపై రాజమౌళి స్పందిస్తూ.. స్పీల్‌బర్గ్ గారిని ఇలా కలవడం అద్భుతంగా ఉందని, ఎగిరి గంతేయాలని ఉందని అన్నారు.. ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది..