‘ఓటిటిల యందు ఆహా ఓటిటి పంధా వేరయా’ అనే చెప్పాలి..! పక్కా తెలుగు కంటెంట్ తో మొదలై అనతి కాలంలోనే ప్రేక్షకాదరణ పొందింది ఆహా. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆహా విజయపధంలో దూసుకుపోతుంది. ఇటీవల తమిళంలోనూ లాంచ్ అయ్యి అక్కడ కూడా మంచి ఆదరణ పొందుతుంది. తెలుగులో అయితే ఇప్పటికే అదిరిపోయే టాక్ షోలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తుంది. బాలకృష్ణతో చేసిన ‘అన్ స్టాపబుల్’ షో అయితే ఇండియా వైడ్ టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ‘ఆహా’ వారు మరో కొత్త ప్రయత్నానికి నాంది పలికిన సంగతి తెలిసిందే.
ఇండియన్ ఐడల్ తెలుగుని ప్రారంభించి తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా యువతని మరింత అలరించేందుకు అలాగే ట్యాలెంట్ ఉన్న ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగింది.ఇప్పటికే 4 ఎపిసోడ్ లు టెలికాస్ట్ అయ్యాయి.వాటన్నిటికీ ప్రేక్షకుల నుండీ మంచి రెస్పాన్స్ లభించింది. కంటెస్టెంట్ ల జర్నీ, వాటి గాత్రం ఎలా ఉంది అనే విషయాలతో పాటు వినోదానికి కూడా ఈ షోలో సమన ప్రాధాన్యతని ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.3వ ఎపిసోడ్లో తమన్ సంగీతంలో ఆరేడు పాటలు పాడిన గాయని అదితి భావరాజు స్టేజ్ మీదకు రావడం అందరినీ సర్ప్రైజ్ చేసింది. పంజాబ్ నుండీ వచ్చిన అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్ జస్కరణ్ సింగ్ ‘అల వైకుంఠపురములో’ లోని ‘సామజవర గమన’ పాట పాడి ఆకట్టుకోవడం…
దానికి ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ అతనికి ‘సిద్ శ్రీరామ్ ఆఫ్ పంజాబ్’ అనే బిరుదు ఇవ్వడం ఆ ఎపిసోడ్ కు హైలెట్ అని చెప్పొచ్చు. అటు తర్వాత 9వ తరగతి చదువుకునే మాలోత్ కవిత ఓ చక్కని పాట పాడి ఆకట్టుకోవడం కూడా చెప్పుకోదగ్గ అంశం. ఇక విజయవాడ కి చెందిన చంద్రకిషన్ కాసేపు కామెడీతో ఆకట్టుకున్నాడు. అనంతరం తెనాలికి చెందిన హర్షవర్థన్ పాటకు గోల్డెన్ టిక్కెట్ దక్కింది. అంతేకాకుండా చిట్టా లక్ష్మీ శ్రావణి, రేణు కుమార్ లకు కూడా గోల్డెన్ ఛాన్స్ లు లభించడం విశేషం. శనివారం ఎపిసోడ్ లో కూడా కొంతమందికి గోల్డెన్ టిక్కెట్, గోల్డెన్ మైక్ లు లభించాయి. మహబూబ్ నగర్ కు చెందిన డెంటిస్ట్ నాగ సాయి సిందూర ‘రేగూ పూలోలే…’ పాటతో అందరినీ అలరించి గోల్డెన్ టిక్కెట్ పొందాడు.
అలాగే కడపకు చెందిన ధర్మశెట్టి శ్రీనివాస్ కూడా తన గాత్రంతో మెప్పించాడు. అతనికి గోల్డెన్ టిక్కెట్ తో పాటు గోల్డెన్ మైక్ కూడా లభించడం విశేషం. ఇక జగదీశ్ … ‘పుష్ప’లో అల్లు అర్జున్ గెటప్ లో స్టేజ్ మీదకు వచ్చి కాసేపు కామెడీ చేసాడు. అటు తర్వాత అతను అదే సినిమాలోని ఓ పాటనుపాడి పెర్ఫార్మ్ చేసాడు.ఇందుకు తమన్.. ‘దయచేసి… సింగర్ గా మారే ప్రయత్నం మాత్రం చేయకు’ అంటూ ఫన్నీ సెటైర్ వేసాడు. ఇలా ఓ పక్కన అద్భుతమైన గాత్రం వినడం.. అది సీరియస్ గా వెళ్తుందన్నప్పుడు ఫన్ జెనెరేట్ చేయడంతో షో సరదా సరదాగా సాగుతున్నాయి.