పుర్రెకో బుద్ధి.. అన్న సామెత తెలుసుగా. అయితే ఆ బుద్ధి ఎందుకు ఎప్పుడు ఎలా పుడుతుందంటే చెప్పే నాధుడెవరూ వుండరు. మన టాలీవుడ్ హీరోలనే తీసుకోండి.. తెరమీద హీరోయిజం చూపించి చిరాకు పుట్టిందో, ప్రేక్షకులను మెప్పించే ఫీట్లు చేయలేమనుకుంటున్నారో గానీ నాయక పాత్ర నుండి ప్రతినాయక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలని ఉబలాటపడుతున్నారు. అదేమిటంటే ఇప్పుడు స్టార్లుగా ఉన్న వాళ్ళు గతంలో ఇలా చేసినవాళ్ళే అంటూ నటుడిగా అన్నిరకాల పాత్రలు చేయాల్సిందేనని హితవు పలుకుతున్నారు. వీళ్ళేదో జగపతిబాబులా వయసు మళ్ళిన హీరోలా అంటే అదీ కాదు.ఈ వరుసలో ముందుగా సునీల్ పేరు చెప్పుకోవచ్చు. హాస్యనటుడు నుండి హీరోగా మారిన సునీల్ పరిశ్రమకు వచ్చిందే విలన్ గా సెటిల్ అవుదామని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. హీరోగా ఎటూ హిట్లు లేవు గనక సరైన సృష్టించే దర్శకులుంటే సునీల్ కోరిక నెరవేరే అవకాశం ఉంది.
ఇక తర్వాతి వ్యక్తి అక్కినేని వారసులతో ఒకరైన సుమంత్. సుమారు రెండేళ్ల తర్వాత నేడు ‘నరుడా డోనరుడా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సుమంత్ విలన్ పాత్రలు చేయాలని ఉందని ఈ మధ్య మనసులో మాట బయటపెట్టాడు. ఈ విషయంలో వీరిద్దరికీ రోల్ మోడల్ మోహన్ బాబే.అక్కినేని వారసులంతా హీరోలుగా తెరమీదికొస్తుంటే ఇతగాడు మాత్రం తనలోని నటుడిని తృప్తి పరచాలంటే నచ్చిన పాత్రలు చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్నాడు. అవసరాల శ్రీనివాస్ వంటివారు కూడా పూర్తిస్థాయి వ్యతిరేక ఛాయలున్న పాత్రలో మెప్పించాలని కలలు కంటుంటే.. ఇటీవల ‘కాష్మోరా’ సినిమాలో రాజ్ నాయక్ గా తొలిసారి నెగిటివ్ పాత్ర చేసిన కార్తీ మాత్రం ఇతర హీరోలకు విలన్ గా నటించేది లేదని తెగేసి చెబుతున్నాడు. అన్న సినిమాలో అయితే తన నిర్ణయం మారొచ్చని అంటున్నాడు. చూద్దాం.. ఈ హీరోలు దాగున్న విలన్ ఎలా ఉంటాడో..?