అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) తనయగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టినా ఎక్కడా ఆ పేరు వాడకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాల ఎంపిక విషయంలో ఇలా చేస్తున్నా.. ప్రేక్షకులు, అభిమానులు మాత్రం ఆమెను శ్రీదేవి తనయగా పిలవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే శ్రీదేవి అనే పేరు, మనిషి ఓ ఎమోషన్. ఇప్పుడు జాన్వీ ప్రతిష్ఠాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ మీద వాక్ చేసినా..
శ్రీదేవినే గుర్తు చేసుకున్నారు. ఆమె తన లుక్, గ్లామ్‌తో ఆ పని చేసింది కూడా. 78వ కాన్స్ చిత్రోత్సవాలు ప్రస్తుతం ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 13న ప్రారంభమైన ఈ వేడుక 24 వరకు జరగనుంది. ఈ క్రమంలో కొందరు నటీనటులు అరంగేట్రం చేసి ఆకట్టుకున్నారు. తాజాగా కథానాయిక జాన్వీ కపూర్ కూడా తొలి అడుగుపెట్టింది. తన లుక్‌తో శ్రీదేవిని గుర్తు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పొడవాటి గౌన్‌ను ధరించిన జాన్వీ రాయల్ లుక్‌లో రెడ్ కార్పెట్‌పై హొయలొలికించింది. తరుణ్ తహ్లియానీ సిద్ధం చేసిన బ్లష్ పింక్ డ్రెస్‌లో.. రియా కపూర్ స్టైలింగ్‌తో జాన్వీ జబర్దస్తీగా తయారైంది అని చెప్పాలి. ఈ క్రమంలో డ్రెస్‌ని క్యారీ చేయడంలో జాన్వీ కపూర్‌కు హీరో ఇషాన్ కట్టర్ సాయం చేయడం ఆసక్తికరంగా మారింది. ఆమెతో పాటు ‘హోమ్ బౌండ్’ చిత్రబృందం కూడా ఈ ఫెస్టివల్‌కు హాజరైంది.
ఇషాన్ ఖట్టర్(Ishaan Khatter), జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హోమ్ బౌండ్’. నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ఈ సినిమాను కాన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది కేన్స్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ఇదే. అన్నట్లు ఇదే వేదిక మీద మరోసారి జాన్వీ కపూర్ రెడ్ కార్పెట్ మీద కనిపించనుంది. మరి అప్పుడు ఎలాంటి కాస్ట్యూమ్‌లో అలరిస్తుందో చూడాలి.
#JanhviKapoor at the #CannesFilmFestival2025 pic.twitter.com/6Ggut71cOF
— ʙᴇꜱᴛ ᴏꜰ ᴊᴀɴʜᴠɪ (@bestofjanhvi) May 20, 2025