యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)..కి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వాళ్లకి ఎన్టీఆర్ ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తాడో కూడా అందరికీ తెలుసు. అభిమానుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే స్పందించే హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ‘మేక్ ఏ విష్’ లో భాగంగా గతంలో ఎన్టీఆర్ ఓ పాపం కలవడం.. ఆ తర్వాత ఎంతో మంది అభిమానులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కి మొరపెట్టుకోవడం.. ఎన్టీఆర్ స్పందించి సాయం చేయడం వంటివి ఎన్నో చూశాం. మొన్నామధ్య ఎన్టీఆర్ అభిమాని యాక్సిడెంట్ పాలైతే వీడియో కాల్ చేసి మరీ ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పాడు.
Jr NTR
కానీ దురదృష్టవశాత్తు ఆ అభిమాని మరణించడంతో.. ఆ అభిమాని కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఇటీవల ఓ అభిమాని క్యాన్సర్ బారిన పడితే.. అతని ట్రీట్మెంట్ కి అయిన ఖర్చు మొత్తం ఎన్టీఆర్ పెట్టుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అభిమానులకి ఎన్టీఆర్ ఇచ్చే ప్రాముఖ్యత ఇలా ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ ను చూడాలనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంటుంది. మొన్నామధ్య ‘దేవర’ (Devara) ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన రచ్చ కూడా అందరూ చూసే ఉంటారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఎన్టీఆర్ అభిమానులు తరచూ.. ఎన్టీఆర్ ను కలవడానికి వెళ్లిపోతున్నారు.
ఎన్టీఆర్ హైదరాబాద్లో ఉన్నాడు అని తెలిస్తే చాలు పాదయాత్రలు చేసుకుంటూ మరీ వెళ్లిపోతున్నారు. వాళ్ళని సిబ్బంది కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఎన్టీఆర్ తన అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఓ లెటర్ రిలీజ్ చేశాడు.”నాపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని నేను అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను.
ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరం అవుతుంది. కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నాను.కాబట్టి.. ఇప్పుడు అభిమానులు నన్ను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని విజ్ఞప్తి చేస్తున్నాను. నా అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా నాకు అత్యంత ప్రధానమైనది” అంటూ ఎన్టీఆర్ తన టీంకి చెప్పడం జరిగిందట. ఈ విషయాన్ని వారు అధికారికంగా వెల్లడించడం కూడా జరిగింది.