దర్శకుడు పా రంజిత్ తక్కువ చిత్రాలతోనే సంచలనం సృష్టించారు. అందుకే చిన్నవయసులోనే రజినీని దర్శకత్వం వహించే ఛాన్స్ అందుకున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన కబాలి అంచనాలను అందుకోలేకపోయింది. అయినా వెంటనే రజినీకాంత్ కాలా సినిమా చేశారు. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని ముందుగా చూసిన దుబాయ్ సెన్సార్ విభాగంలో పనిచేస్తున్న ప్రముఖ సినీ విశ్లేషకుడు ఫస్ట్ రివ్యూ అందించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. సినిమా ఎలా ఉందంటే?
కథ మురికివాడల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచే నాయకుడు.. ఆ వాడలను సొంతం చేసుకోవాలనే చూసే వారికీ మధ్య జరిగే సంగ్రామమే కాలా. బలవంతుల నుంచి బలహీనుల్ని కాలా ఎలా రక్షించాడన్నదే కాలా కథ.
రజినీ స్టైల్, డైలాగ్ డెలివరీ స్టైల్ కి, డైలాగ్ డెలవిరీకి సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కి తిరుగులేదు. కాలా చిత్రంలో అవి కొంచెం కూడా మిస్ కాలేదు. అంతకు మించి ఉన్నాయి. నేటి యువత మెచ్చేలా ఫైట్స్ అదరగొట్టారు. మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేలా రజినీకాంత్ ఫుల్ ఎనర్జీతో యాక్షన్ సీక్వెన్స్ చేశారు. ఎమోషన్ సీన్స్ లో సైతం అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు.
నానా పటేకర్ అద్భుత నటన రజినీకాంత్ తో పాటు ఈ సినిమాకి నానా పటేకర్ అద్భుత నటన ప్లస్ అయింది. హీరోకి తగ్గ విలన్ గా నటించారు. ఈశ్వరి రావు, హుమా క్కురేషి తో పాటు మిగతా నటీనటులందరూ చక్కగా నటించి మెప్పించారు.
డైరక్షన్ అద్భుతహా పా రంజిత్ సూపర్ స్టార్ కి అభిమాని. ఆ అభిమానంతోనే కబాలిలో రజినీని సూపర్ గా చూపించారు. ఇందులోనూ ఆకర్షణీయంగా చూపించారు. అయితే కబాలీలో మిస్ చేసిన వాటిని ఇందులో జోడించారు. సాధారణ కథ అయినప్పటికీ వెండితెరపై దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకుడిని కుర్చీలోంచి కదలకుండా చేసింది. ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే అనే కసితో సినిమా చేసినట్టు అనిపిస్తోంది. ఎక్కడా బోర్ అనే ఫీల్ రాకుండా సినిమాని పరుగులెత్తించారు.
టెక్నీషియన్స్ పనితీరు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మురళి ఈ సినిమాని కనులవిందుగా చిత్రీకరించారు. ముఖ్యంగా ఆర్ట్ డైరక్టర్ పనితనం అభినందనీయం. మురికివాడ సెట్ అయితే ప్రశంసించకుండా ఉండలేము. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కత్తెరకి బాగా పదును పెట్టారు. అనవసరపు షాట్ ఒక్కటి కూడా లేకుండా ఎడిటింగ్ చేశారు. వీరందరి కృషి తెరపైన స్పష్టంగా కనిపిస్తోంది.
నేపథ్య సంగీతం కబాలి సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి పనిచేశారు. తనదైన శైలిలో పాటలను అందించారు. నేపథ్య సంగీతం అయితే కథకి బలాన్నిచ్చింది.
చివరి మాట రోబో తర్వాత రజినికాంత్ అభిమానులు గర్వంగా చెప్పుకునే సినిమా రాలేదు. దాదాపు ఎనిమిదేళ్లుగా నిరాశలో ఉన్న ఫాన్స్ కి కాలా కాలర్ ఎగరేసే విజయాన్ని ఇవ్వనుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు పూర్తి వినోదాన్ని కాలా అందించనుంది.
ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ట్వీట్ ని ఆధారం చేసుకొని రాసింది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ, రేటింగ్ రేపు రానుంది.