కమల్ హాసన్ (Kamal Haasan) ఎంతో కష్టపడి నటించిన ‘ఇండియన్ 2’ (Bharateeyudu 2) సినిమా, ప్రేక్షకులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా, అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కమర్షియల్ గా డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రానికి భారీ నష్టాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ (Shankar) మార్క్ ఆ సినిమాలో కనిపించకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇండియన్ 2’ రిలీజ్ సమయంలో మేకర్స్ ‘ఇండియన్ 3’పై కూడా క్లారిటీ ఇచ్చారు.
Kamal Haasan
‘ఇండియన్ 2’ చివర్లోనే ‘ఇండియన్ 3’ ట్రైలర్‌ను విడుదల చేశారు, ఇది ప్రేక్షకులలో అంచనాలు పెంచింది. అంతేకాకుండా, హీరో కమల్ హాసన్ కూడా ఇండియన్-3 షూటింగ్ పూర్తి అయ్యిందని, కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ అప్డేట్ తో అప్పట్లోనే ప్రేక్షకులలో భారీ ఆశలు రేపింది. అయితే ‘ఇండియన్ 2’ డిజాస్టర్ తర్వాత, ‘ఇండియన్ 3’ విషయంలో డౌట్స్ మొదలయ్యాయి.
కొంతమంది ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తారని చర్చ జరిగింది. అయితే, ఆ మధ్య వచ్చిన ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, తాజా సమాచారం ప్రకారం ‘ఇండియన్ 3’కి సంబంధించి కొన్ని సీన్లను మళ్లీ రీషూట్ చేయాలని కమల్ హాసన్ నిర్ణయం తీసుకున్నారట. కథలో కొన్ని మార్పులు చేస్తే, సినిమా మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. కమల్ చేసిన ఈ ప్రతిపాదనకు దర్శకుడు శంకర్ సహా చిత్ర యూనిట్ అంగీకరించినట్లు సమాచారం.
వీలైనంత త్వరగా రీషూట్ చేయాలని, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయని టాక్. కొత్త సీన్స్ కోసం నెల రోజులపాటు రీషూట్ జరగబోతోందని తెలుస్తోంది. కమల్ కూడా తనకు తగ్గట్టు కొన్ని కొత్త సీన్స్ కోసం డెడికేషన్‌తో షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రీషూట్ వల్ల ‘ఇండియన్ 3’ విడుదలపై మరింత ఆసక్తి పెరిగింది. కమల్ హాసన్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం సినిమా ఫలితాన్ని మార్చేలా ఉంటుందని యూనిట్ భావిస్తోంది.