‘ఆచార్య’ సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి వరుసగా సినిమాలు ఒప్పేసుకున్నారు. ఆయన ఓకే చేసిన నాలుగు సినిమాల్లో వెంకీ కుడుముల సినిమా ఒకటి. ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలతో ఘన విజయాలందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ మెగాస్టార్ కి పెద్ద ఫ్యాన్. ఆ అభిమానంతోనే ఒక కథ రెడీ చేసి చిరుని కలవడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి.
గత ఏడాదే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ‘ఆచార్య’ డిజాస్టర్ అవ్వడంతో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిరు. స్క్రిప్ట్ విషయంలో రాజీ పడడం లేదని.. ఈ క్రమంలోనే వెంకీ కుడుముల స్క్రిప్ట్ సంతృప్తికరంగా రాకపోవడంతో ఆ సినిమాను క్యాన్సిల్ చేస్తున్నాడని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీని గురించి ఇటు చిరు సన్నిహిత వర్గాలు కానీ.. వెంకీ వైపు నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు.
దీంతో ఈ సినిమా విషయంలో చిరు ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. అయితే ఈ ప్రచారాన్ని నేరుగా ఖండించలేదు కానీ.. పరోక్షంగా ఈ రూమర్లకు చెక్ పెట్టేశారు వెంకీ కుడుముల. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు వెంకీ. ఈ సందర్భంగా చిరంజీవితో చేయబోయే సినిమా ప్రస్తావన వచ్చింది. ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్.. కమల్ కి పెద్ద ఫ్యాన్. ఒక అభిమాని అయితేనే తన హీరోను తెరపై ఎలా ప్రెజంట్ చేయాలో తెలుస్తుందని చెబుతూ లోకేష్ ని కొనియాడిన వెంకీ..
తాను కూడా చిరుని ది బెస్ట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. మధ్యలో కమల్ జోక్యం చేసుకొని.. కేవలం అభిమాని అయితే సరిపోదని.. తమ ఫేవరెట్ హీరో ఫిల్మోగ్రఫీ అంతా చూసి వాళ్లకు ఎక్కువగా పేరు తెచ్చిన సినిమా ఏదో చూడాలని.. చిరును బాలచందర్ ఆర్ట్ తరహా సినిమాలో అద్భుతంగా చూపించారని, అలాగే రాఘవేంద్రరావు కమర్షియల్ సినిమాల్లో గొప్పగా ప్రెజెంట్ చేశారని.. ఈ రెండు తరహా చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ చిరుతో సినిమా తీయాలని సలహా ఇచ్చారు. దీనికి వెంకీ.. కచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తానని అన్నారు.