మలయాళీ నటుడు కళాభవన్ మణి మృతి కేసు విచారణను సిబిఐ కు అప్పగిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మృతికేసులో పలు చిక్కులు ఉన్నందున ఈ కేసును సిబిఐ అప్పగించాలన్న డిజిపి లోక్ నాథ్ బెహెరా సూచన మేరకు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు కేరళ హోం సెక్రటరీ స్పష్టం చేసింది.
మరోవైపు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన పినరై విజయన్ ను వారం రోజుల క్రితం కలిసిన మణి సోదరుడు ఆర్‌ఎల్‌వి రామకృష్ణన్ ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని కోరాడు. కాగా మార్చి 6 న త్రిస్సూర్ లో మణి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఆయన మృతి సహజమైంది కాదని..
ఆయన తీసుకున్న మద్యంలో హానికారక విష పూరితమైన క్రిమిసంహారక మందులు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది. మణి స్నేహితులే మణి మృతికి కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.