పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా అతడి అన్నయ్య చిరంజీవి మైనస్ అవుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. చిరు రాజకీయ పార్టీ పెట్టి ఫెయిల్ అవ్వడం పవన్ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అలానే పవన్ రాజకీయంగా వ్యతిరేకించే వ్యక్తులతో చిరంజీవి సన్నిహితంగా మెలగడం కూడా ప్రతికూలతగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సహా చాలా మంది వైకాపా నేతలు చిరుతో సన్నిహితంగా ఉంటారు. పవన్ ని బూతులు తిట్టిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇటీవల కలిసినప్పుడు కూడా చిరంజీవి క్లోజ్ గా కనిపించారు.
అందరితో మంచిగా ఉండాలనే ఆలోచన, చిరంజీవి మొహమాటం పవన్ అభిమానులకు, జనసైనికులకు రుచించడం లేదు. తాజాగా ఈ విషయంపై చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పవన్ మీద వచ్చిన విమర్శలు, ఆయనకు ఎదురయ్యే తిట్ల గురించి చిరంజీవిని ప్రశ్నించగా.. అవన్నీ వింటే బాధ కలుగుతుందని చెప్పారు చిరు. పవన్ కళ్యాణ్ తన బిడ్డ లాంటి వాడని.. ఎత్తుకొని పెంచానని చిరు అన్నారు. ఎలాంటి స్వార్ధం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని..
అతడికి డబ్బు యావ, పదవీ కాంక్ష రెండూ లేవని అన్నారు. తన కోసం తను ఏదీ ఆలోచించడని, మొన్నటివరకు పవన్ కళ్యాణ్ కి సొంతంగా ఇల్లు కూడా లేదని చెప్పారు. టైంకి అన్నం తినడు, సరైన బట్టలు కూడా వేసుకోడని చెప్పారు. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపనతో అన్నీ వదిలేసిన యోగి లాంటి వాడని అన్నారు. అంత చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి రాజకీయాలనే మురికి కూపంలోకి వెళ్లాడని.. మురికిని తీసేయాలనుకునేవారికి కొంత మురికి అంటడం మామూలే అని..
ఒక స్వచ్ఛమైన ప్రయత్నం చేస్తున్నపుడు ప్రోత్సహించాలి.. కానీ మితిమీరి పవన్ కళ్యాణ్ ని అనరాని మాటలు అన్నపుడు బాధ కలుగుతుందని చెప్పారు. పైగా పవన్ కళ్యాణ్ ని తిట్టినవాళ్లు మళ్లీ తనదగ్గరకొచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారని.. రమ్మని బతిమాలతారని.. తమ్ముడిని అన్నేసి మాటలు అన్నవాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి వస్తుందనే బాధ ఉంటుందని చిరు చెప్పుకొచ్చారు.