‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో హీరో నాని నటించనున్న నూతన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమా కోసం దర్శకుడు ఎన్నుకున్న కథ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదొక పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తోన్న సినిమా అని సమాచారం. ఓ జన్మలో అనుకోకుండా చనిపోయిన నాని.. మరో జన్మ ఎత్తుతాడు. ఓ జన్మలో రచయిత, మరో జన్మలో దర్శకుడు. ఇదే అసలు కథ అట. శ్యామ్ ఒకరు, సింగరాయ్ ఒకరు. ఈ రెండు పాత్రలతో పాటు నాని 65ఏళ్ల ముసలాడి పాత్రలో కూడా కనిపించనున్నారని టాక్.
విలక్షణ పాత్రలు చేయడంతో ముందుండే నాని ఇప్పుడు ముసలాడి పాత్రకు కూడా రెడీ అయిపోతున్నాడు. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లను కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా ఫైనల్ చేయగా. మరో హీరోయిన్ కి కూడా చోటుందని.. ఆ పాత్రలో అదితిరావు హైదరి, నివేదా థామస్ లాంటి వారిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు నాని వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
కానీ మొదటిసారి పునర్జన్మల కాన్సెప్ట్ కి ఓకే చెప్పాడు. గతంలో టాలీవుడ్ లో ఇదే కాన్సెప్ట్ తో ‘మగధీర’ అనే సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు నాని అదే జోనర్ ని టచ్ చేయబోతున్నారు. మరి యంగ్ డైరెక్టర్ రాహుల్ ఈ సినిమాను ఎంతవరకు హేండిల్ చేస్తారో చూడాలి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.