రామ్‌చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు (Buchi Babu Sana) సినిమా స్పెషల్‌గా ఉంటుంది అని నిర్మాణ సంస్థ చాలా రోజుల నుండి చెబుతోంది. బుచ్చిబాబు తన కాస్ట్ అండ్ క్రూ విషయంలో స్పెషల్‌గానే ఆలోచిస్తున్నారు. ఎంపిక కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ విషయంలో కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో వింటేజ్ లుక్ కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలా పాత తరం కెమెరాతో సినిమాను షూట్ చేయబోతున్నారట. పాత రోజుల్లో సినిమా చిత్రీకరణ కోసం ఫిల్మ్ రీల్‌ని వాడేవారనే విషయం తెలిసిందే.
Ram Charan
అందుకోసం నిర్మాతలకు బాగా ఖర్చయ్యేది కూడా. టెక్నాలజీ పెరగడం, ఫిల్మ్ వృథా కాకూడదని అనుకోవడం లాంటి కారణాల వల్ల రీల్ బదులు చిప్ వచ్చింది. డిజిటల్ కెమెరాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అయితే పాత తరం కెమెరాతో చిత్రీకరిస్తే కొన్ని షాట్స్ బాగా వస్తాయని అంటుంటారు. ఇప్పుడు అదే కారణంతో బుచ్చిబాబు కొన్ని సీన్స్ పాత రీల్ కెమెరాతో చిత్రీకరించనున్నారట. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు (R. Rathnavelu) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సినిమాలోని ప్రత్యేకమైన సీక్వెన్స్ కోసం పాత రోజులనాటి కొడక్ ఫిల్మ్ కెమెరాలో షూట్ చేసి, ఆ తర్వాత దాన్ని డిజిటల్ రూపంలో మారుస్తారట. పీరియాడిక్ కథతో రూపొందుతున్న చిత్రమిది. నాటి కాలంలో ఉన్నామనే ఫీలింగ్ కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ అంధుడిగా కనిపిస్తాడు అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.
‘రంగస్థలం’(Rangasthalam) సినిమాలో చెవిటివాడిగా కనిపించి అదరగొట్టిన రామ్‌చరణ్‌ను ఇప్పుడు ‘పెద్ది’ (RC16 Movie) (వర్కింగ్ టైటిల్)లో అంధుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అయితే అది సినిమా మొత్తమా లేక కొన్ని సన్నివేశాల వరకేనా అనేది తెలియాల్సి ఉంది. అన్నట్లు ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో శనివారం ప్రారంభమైంది. రామ్‌చరణ్, ఇతర ముఖ్య తారాగణం మీద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్ పుట్టిన రోజు మార్చి 26న సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది.