ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీపై రిలీజ్ కు ముందు ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడగా వీక్ డేస్ లో సైతం ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తోంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సలార్ గురించి, ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వర్షం, పౌర్ణమి సినిమాల సమయం నుంచి ప్రభాస్ ను చూస్తున్నానని పరుచూరి పేర్కొన్నారు.
ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మంచితనానికి మారుపేరు అని ఆయన వెల్లడించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ప్రభాస్ లోని గొప్ప విషయమని పరుచూరి కామెంట్లు చేశారు. నేటితరం హీరోల్లో ప్రభాస్ కు మొదట జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని బాహుబలి ప్రభాస్ కు ఒక వరమని ఆ సినిమాతో ప్రభాస్ అందరి హృదయాల్లో స్థానం సంపారించారని పరుచూరి పేర్కొన్నారు.
సలార్ తో (Salaar) ప్రభాస్ మరో విజయాన్ని అందుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కేజీఎఫ్ లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారని పరుచూరి కామెంట్లు చేశారు. ప్రశాంత్ నీల్ ఒక జానపద కథను యాక్షన్ మూవీగా తీశారని ఆయన చెప్పుకొచ్చారు. సలార్ లోని పాత్రలన్నీ అద్భుతాలే అని ఈ సినిమా వెనుక బాహుబలి స్పూర్తి ఉండవచ్చని అనుకుంటున్నానని పరుచూరి వెల్లడించారు.
ప్రస్తుతం ఒక హీరో రెండేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్నారని ప్రేక్షకుల అభిరుచిలో అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని ఆయన అన్నారు. ప్రేక్షకులు కోరుకునే విధంగా సినిమాలు తీయాలని ఇప్పటి దర్శకులు ఆలోచిస్తున్నారని పరుచూరి అన్నారు. ప్రేక్షకుల ఆలోచనలకు అనుగుణంగా సినిమాలు తీసే విషయంలో రాజమౌళి ముందువరసలో ఉంటే అలా నటించే హీరోల జాబితాలో ప్రభాస్ తొలి స్థానంలో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.