విజయ్ దేవరకొండ తన తర్వాత సినిమాగా ‘రౌడీ జనార్ధన’ చేస్తాడు అని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు పూర్త చేసుకొని సెట్స్ మీదకు వెళ్తోందని వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని ఓ ట్వీట్‌తో సరిపెడతారు అని తొలుత అందరూ అనుకున్నా ‘రౌడీ జనార్ధన’ అంటే ఇతనే అంటూ ఓ గ్లింప్స్‌నే రిలీజ్ చేశారు.
సినిమా కాన్సెప్ట్ చెబుతూనే.. ఏడాది ముందే ఎందుకు గ్లింప్స్ రిలీజ్ చేశారు అనే డౌట్‌ను క్రియేట్ చేశారు నిర్మాత దిల్ రాజు. ‘‘కళింగ పట్నంలో ఇంటికొకడు నేను రౌడీనని చెప్పుకు తిరుగుతాడు. కానీ, ఇంటి పేరునే రౌడీగా మార్సుకున్నోడు ఒక్కడే ఉన్నాడు. జనార్ధన.. రౌడీ జనార్ధన’’ అంటూ హీరోను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘బండెడు అన్నం తిని.. కుండెడు రక్తం తాగే రాచ్చసుడి గురించి ఎప్పుడైనా విన్నావా’ అంటూ జనార్ధన పాత్ర గురించి మరింత క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటిదాకా విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ నుండి ఇది పూర్తి స్థాయి మాస్ పాత్ర అని చెప్పొచ్చు. 80వ దశకం నేపథ్యంలోని ప్రపంచాన్ని పునర్ సృష్టించబోతున్నారు ఈ సినిమా కోసం. దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని టీమ్ ఘనంగా చెప్పింది. అయితే ఏడాది ముందు గ్లింప్స్ ఎందుకు అనేదే ఇప్పుడు ప్రశ్న.
దీనికి సమాధానం ఏంటా అని చూస్తే.. విజయ్‌కి గత కొన్ని ఏళ్లుగా సరైన విజయం లేదు. ఈ సినిమా కథేంటి అనేది ఇంతవరకు బయటకు రాలేదు. కనీసం లీక్‌లైనా లేవు. ఈ సమయంలో ఈ సినిమా బిజినెస్ ఊపు అందుకోవాలి అంటే సినిమా ఏంటో బయటి వారికి తెలియాలి. అప్పుడే బజ్ వస్తుంది. గతంలో ‘సంబరాల యేటిగట్టు’ విషయంలో ఇలానే చేశారు. ఇప్పుడు ‘రౌడీ జనార్ధన’ కూడా అందుకే ఎర్లీగా లుక్ ఇచ్చాడని చెప్పొచ్చు.
