కథకి తగ్గ నటీనటులు ఉండడమే కాదు.. కథ కోరుకున్నట్టు ఆయా లోకేషన్స్ లలో తెరకెక్కించడమూ ముఖ్యమే. అందుకే దర్శక నిర్మాతలు స్టార్స్ డేట్స్ తో పాటు.. లొకేషన్ పరిమిషన్స్ కూడా తీసేసుకుంటారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సాహో కోసం దుబాయ్ లోని కొన్ని లోకేషన్స్ పరిమిషన్ తీసుకున్నారు. కానీ అబుదాబి వద్ద యాక్షన్ సీన్ షూటింగ్ కి అక్కడి అధికారులు ఒప్పుకోకపోవడంతో ఆ ఫైట్ సీన్ ని రామోజీ ఫిలిం సిటీ లో సెట్ వేసి చిత్రీకరించారు. ఇక దుబాయ్ శివార్లలోని భారీ ఎడారి, కొండల మధ్య ఛేజింగ్ సన్నివేశాలు తీయాలని అనుకున్నారు. కానీ అందుకు కూడా అనుమతిని నిరాకరించారు. హైవేల మీద షూట్ చేయడానికి అక్కడ అధికారులు ఒప్పుకోకపోవడంతో సుజీత్ తలపట్టుకు కూర్చున్నారు. 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ అక్కడే తీయాలని అనుకుంటే ఇలా అయిందేమిటీ అని సాహో చిత్ర బృందం బాధపడింది.
కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం మార్చి మూడో వారం నుంచి దుబాష్ షెడ్యూల్ షూటింగ్ మొదలు కానుందట. అనుమతుల విషయంలో క్లారిటీ రావటంతో ఇప్పటికే కొంత మంది యూనిట్ సభ్యులు దుబాయ్ చేరుకొని షూటింగ్ అవసరమైన ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు టాక్. దుబాయ్, అబుదాబి, రొమేనియాల్లో 60 రోజుల పాటు ఈ షూటింగ్ జరగనుంది. ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ,ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.