బ్రహ్మానందం… తెలుగు ప్రజలకు పరిచేయనవసరం లేని పేరు. ఇరవై ఏళ్లకి 867 సినిమాల్లో నటించినందుకుగాను గిన్నిస్ అవార్డు సొంతం చేసుకున్నారు. నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ గౌరవాన్ని అందుకున్నారు. ముప్పైయేళ్లుగా విభిన్న పాత్రలు పోషిస్తూ, వెయ్యిచిత్రాల మైలురాయిని దాటుకొని దూసుకుపోతున్న ఈ నవ్వుల బ్రహ్మ వేయని పాత్ర అంటూ లేదు. ఆయన నటించిన ఎన్నో వందల క్యారెక్టర్లు పగలబడి నవ్వించాయి. వాటన్నింటి గురించి రాయాలంటే పుస్తకాలే సరిపోవు. అందుకే అయన పుట్టిన రోజు(ఫిబ్రవరి 1) సందర్భంగా కొన్ని క్యారెక్టర్స్ పై ఫోకస్..
అహనా పెళ్లంటజంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహనా పెళ్లంట చిత్రం ద్వారా బ్రహ్మానందం గుర్తింపు పొందారు. ఇందులో అరగుండు వెదవ గా అయన చేసిన నటన అదరహో అనిపించింది. ఆహార్యంతో పాటు అభినయం.. ముఖ్యం గా నత్తి మాటలు నవ్వించాయి.
మనీఒక దాదా కి సినిమా పిచ్చి ఉంటే ఎలా ఉంటుంది ? .. అటువంటి క్యారక్టర్ కి బ్రహ్మి ప్రాణం పోశారు. మనీ చిత్రంలో ఖాన్ దాదా గా కితకితలు పెట్టించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్రహ్మానందంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
జంబలకిడి పంబఈవీవీ సత్యనారాయణ కట్టిన నవ్వులమాలలో జంబలకిడి పంబ అనేది ఒక ప్రత్యేక పువ్వు. ఈ చిత్రంలో మొగుడు చచ్చిన ఆమె గా బ్రహ్మి నటన చూస్తుంటే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు. మహిళగా కూడా తాను కామెడీ పండించగలనని ఈ చిత్రం ద్వారా నిరూపించారు.
చిత్రం భళారే విచిత్రంఅతి భక్తుడిగా బ్రహ్మనందం “చిత్రం భళారే విచిత్రం”లో నటించి థియేటర్ నిండా నవ్వులు నింపారు. దేవుడు పటాలు, విగ్రహాలు కనిపిస్తే ఒళ్ళు మరిచిపోయి దండాలు పెడుతూ, ముద్దులిచ్చే ఈ పాత్రను ఎప్పటికీ మరచిపోలేము. ఇందులో అతని పాత్ర పేరు బ్రహ్మనందమే.
వినోదంశ్రీకాంత్ హీరోగా ఎస్సావీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన “వినోదం” చిత్రంలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా బ్రహ్మానందం నవ్వించారు. అమాయకమైన ఫేస్ కలిగిన కన్నింగ్ దొంగ గా బ్రహ్మి భలే ఆకట్టుకున్నారు.
అనగనగ ఓ రోజు“ఐ వాంట్ టాక్ టు నెల్లూరు పెద్దా రెడ్డి ..” ఈ ఒక్క డైలాగ్ తో అనగనగ ఓ రోజు సినిమాలో హీరో కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. రామ్ గోపాల్ వర్మ డైరక్షన్లో వచ్చిన ఈ మూవీలో బ్రహ్మి కనిపించినప్పుడల్లా బ్యాగ్రౌండ్ లో పాప్ స్టార్ మైఖేల్ ముఖేల్ జాక్సన్ పాటల మ్యూజిక్ రావడం అతని కామెడీకి ప్లస్ అయింది.
మన్మధుడులవంగం.. ఈ పేరు వింటేనే పెదాలపై చిరునవ్వు పూస్తుంది. ఈ పాత్రను బ్రహ్మి పోషిస్తే .. అతనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తే.. ఇంకేమి ఉంటుంది నవ్వుల వానే. కింగ్ నాగార్జున సినిమా మన్మధుడు లో లవంగంగా బ్రహ్మానందం కాసేపు నవ్వుల సునామీ సృష్టించారు.
అతడుసూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన అతడు చిత్రంలో విశ్రాంతి తర్వాత ఎంట్రీ ఇచ్చి కామెడీకి బ్రేక్ లేకుండా చేశారు. హీరోయిన్ కి అంకుల్ గా కృష్ణ మూర్తి పాత్రలో తెగ నవ్వించారు. ఇందులో బ్రహ్మి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది.
అదుర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేసిన అదుర్స్ మూవీలో బ్రహ్మి భట్టాచార్య (భట్టు)గా నయనతారతో ప్రేమ వ్యవహారం సాగించి ఫన్ క్రియేట్ చేశారు. తారక్ తో బ్రహ్మానందం కలిసి ఉన్న సీన్లు బాగా పేలాయి.
రేసుగుర్రంస్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చిత్రం రేసుగుర్రంలో ఫ్రస్టేషన్ పోలీసాఫీసర్ కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం యాక్షన్ సీన్స్ తో కామెడీ పూయించారు. తన అనుభవం, టైమింగ్ కి కాస్త హీరోయిజాన్ని జోడించి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.