సరైన విజయం లేక చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఓ స్టార్ హీరో, మరో స్టార్ దర్శకుడు కలసి ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ ఉంది. దీంతో ఆ సినిమా ఫలితం మీద ఆసక్తి కనిపిస్తోంది. ఆ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) అయితే, ఆ దర్శకుడు మురుగదాస్ (A.R. Murugadoss). ఇక ఆ హీరోయిన్ రష్మిక మందన (Rashmika Mandanna) అని మేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముగ్గురూ ఉన్న సినిమా ‘సికందర్’ (Sikandar) . ఇక అసలు విషయానికొస్తే.. ఈ సినిమా ప్రచారం చాలా చప్పగా సాగబోతోంది.
మామూలుగా అయితే బాలీవుడ్ సినిమా ప్రచారం ఓ మోస్తరుగానే ఉంటుంది. అంటే ఓ ప్రెస్ మీట్, నాలుగు ఇంటర్వ్యూలు, టీవీ షోలు, రియాలిటీ షోలు ఇలానే సాగుతుంది. అయితే ‘సికందర్’ విషయంలో నిర్మాణ సంస్థ భారీ కార్యక్రమాలు చేపడుతోంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సల్మాన్ సినిమాకు రావాల్సిన బజ్ ఇంకా రాలేదని, దాని కోసం త్వరలో భారీ ఈవెంట్ నిర్వహిస్తారని ఆ వార్తల సారాంశం. కానీ అవేవీ లేవు అంటున్నారు.
రంజాన్ పర్వదినం కానుకగా మార్చి 30న ‘సికందర్’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా సరిగ్గా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు వస్తున్న వార్తల బట్టి చూస్తే సినీప్రియులకు, సల్మాన్ అభిమానులకు, రష్మిక అభిమానులకు ఒకింత నిరాశే. ఎందుకంటే సినిమా ప్రచార ఈవెంట్స్ నిర్వహణ విషయంలో టీమ్ వెనకడుగు వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
2023లో ‘టైగర్ 3’తో (Tiger 3) వచ్చిన సల్మాన్ మళ్లీ బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో టీమ్ భారీ స్థాయిలోనే ఈవెంట్స్ ప్లాన్ చేసింది. 30 వేల మందికిపైగా అభిమానుల సమక్షంలో సినిమా ట్రైలర్ విడుదల చేయాలని అనుకుంది. ఆ తర్వాత వరుస ప్రెస్ మీట్స్ ప్లాన్ చేసింది. కానీ సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో భద్రతాపరమైన సమస్యలు రావొచ్చని ఈవెంట్స్ వద్దనుకుంటున్నారట.
ఇక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చూస్తే.. ఈ సినిమా కథను సల్మాన్‌కు మురుగదాస్ చెప్పి.. 2025 సెకండాఫ్‌లో స్టార్ట్ చేద్దాం అన్నారట. అయితే కథ బాగా నచ్చడంతో అప్పటికే ఓకే చేసిన మరో సినిమాను పక్కన పెట్టి మురుగదాస్ కథను ఓకే చేసి పట్టాలెక్కించారట. అంటే అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఇప్పుడు ఇంకా ఈ సినిమా స్టార్ట్ అయ్యేది.