ఉంటుంది ఉంటుంది అంటూ చాలా నెలలుగా వార్తలు వచ్చి.. ఎట్టకేలకు ఏప్రిల్ 8న అనౌన్స్ అయిన సినిమా గురంచే ఈ వార్త. ఆ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హీరో, దర్శకుడు.. గ్లోబల్ స్టార్‌ను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. గ్లోబల్ స్టార్ అంటే రామ్‌చరణ్ (Ram Charan) అనుకునేరు.. ఆయన గ్లోబల్ హీరో కాకముందే ఓ హీరోయిన్ గ్లోబల్ స్టార్ అయింది. ఆమెనే ప్రియాంక చోప్రా (Priyanka Chopra). ఆమె గురించి చెప్పేశాం కాబట్టి.. ఆ సినిమా డైరక్టర్ అట్లీ (Atlee Kumar) అని, ఆ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అని రివీల్ చేసేయొచ్చు.
అవును, మీరు చదివింది నిజమే. అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను టీమ్ సంప్రదంచింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ – అట్లీ కలయికలో ప్రాజెక్ట్‌ను ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఒక హీరోకు సమంత (Samantha) కథానాయిక అని, మరో హీరోకు ప్రియాంక చోప్రా హీరోయిన్ అని ఓ వార్త కోలీవుడ్ – టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ప్రపంచ మార్కెట్‌పై పోకస్ పెట్టి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, హాలీవుడ్‌లో కూడా కావాల్సినంత గుర్తింపు ఉన్న ప్రియాంక చోప్రా అయితే సినిమాకు బాగా ఉపయోగంగా ఉంటుంది అని టీమ్ అనుకుంటోందట. మరి ఆమె ఏమంటుందో చూడాలి. ప్రియాంక ఇప్పటికే మహేశ్‌బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమవుతుంది అంటున్న AAA ప్రాజెక్ట్ గురించి త్వరలో చాలా క్లారిటీలు వస్తాయి అని చెబుతున్నారు.
ఆ విషయం అలా ఉంచితే హీరో – హీరోయిన్ మధ్య దశాబ్దం, దశాబ్దంన్నర గ్యాప్ ఉంటున్న ఈ రోజుల్లో కేవలం ఒకే ఒక్క సంవత్సరం ఏజ్ గ్యాప్ ఉన్న కాంబోగా అల్లు అర్జున్ – ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నిలిచే అవకాశం ఉంది. అయితే ఇదంతా ఈ సినిమాకు ఆమె ఓకే అంటేనే అనుకోండి.