తెలుగు-తమిళ-మలయాళ-కన్నడ-హిందీ భాషల్లో దాదాపుగా 65 సినిమాల్లో నటించిన అనుభవంతోపాటు.. ఇండస్ట్రీలో పన్నెండేళ్ళ ఎక్స్ పీరియన్స్ ఉన్న త్రిష ఈమధ్యకాలంలో హీరోయిన్ రోల్స్ తగ్గించి కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించడానికే మొగ్గు చూపుతూ వస్తోంది. అందుకే ఈమధ్యకాలంలో ఆమె సినిమాల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. అయితేనేం.. తెలుగులో కనిపించడం లేదు కానీ మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే మంచి సినిమాలు చేస్తూ నటిగా తన సత్తాను చాటుకొంటోంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకి ఈ విషయమే నచ్చియనట్లుంది, అందుకే రజనీకాంత్ హీరోగా తాను తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో ఓ ముఖ్యపాత్ర కోసం త్రిషను ఎంపిక చేసుకొన్నాడు.
ఇంకా టైటిల్ నిర్ణయించబడని ఈ చిత్రంలో ఇప్పటికే బాలీవుడ్ టాప్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి, సిమ్రాన్ లు కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఇప్పుడు ఈ టీం లో త్రిష జాయిన్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రజనీకాంత్-త్రిష కాంబినేషన్ లో రాబోతున్న మొట్టమొదటి సినిమా ఇది. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రజనీ సరసన నటించే అవకాశం సొంతం చేసుకోలేకపోయిన త్రిష ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో రజనీకాంత్ ఆఖరి సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న చిత్రంలో నటించే అవకాశం సొంతం చేసుకోవడం విశేషం.