మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను, తెలుగు సినిమా స్టామినాను ఆకాశానికి చేర్చిన సినిమాల్లో ‘ఘరానా మొగుడు’ ఒకటని చెప్పొచ్చు. ఈ సినిమా సాధించిన విజయం ఎన్ని సంచలనాలు సృష్టించిందో, ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో బహుశా చాలా మందికి తెలిసుండదు. చిరంజీవి మాస్ పెర్ఫార్మన్స్, డైలాగ్స్, డ్యాన్సులు, పాటలు, నగ్మా గ్లామర్,ఇగోయిస్టిక్ పెర్ఫార్మన్స్, వాణీ విశ్వనాథ్ గ్లామర్.. ఇలా అన్ని బాగా పండడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే కీరవాణి సంగీతం మరో ఎత్తు అని చెప్పాలి. ‘బంగారు కోడిపెట్ట సాంగ్’ ‘పండు పండు’ పాటలు ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి.చిరు చెప్పే ‘కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో’ డైలాగ్ ఆ టైములో రాష్ట్రం మొత్తం మార్మోగిపోయింది. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా నేటితో మూడు వసంతాలను (30 ఏళ్ళను) పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ‘ఘరానా మొగుడు’ కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1) చిరంజీవి- రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సినిమా వస్తే దానికి తిరుగులేదని ‘ఘరానా మొగుడు’ చిత్రం ఆ టైములో మరోసారి నిరూపించింది. వీరి కాంబినేషన్లో మొత్తం 13 సినిమాలు రాగా అందులో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ‘ఘరానా మొగుడు’ చిత్రం.
2) వరుసగా మూడేళ్లు చిరు- రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమాలు రిలీజ్ అయ్యి.. హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. అవి ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ (1990), ‘రౌడీ అల్లుడు’ (1991), ‘ఘరానా మొగుడు’ (1992).
3) ఈ చిత్రానికి కన్నడలో రాజ్ కుమార్ నటించిన ‘అనురాగ అరళితు’ ఆధారం. ఈ కథతో తమిళంలో రజనీకాంత్, విజయశాంతి జంటగా ‘మన్నన్’ తెరకెక్కింది. ఆ తరువాత దీనిని తెలుగులో ‘ఘరానా మొగుడు’గా రీమేక్ చేశారు.
4) ‘ఘరానా మొగుడు’ ఆ రోజుల్లోనే 56 కేంద్రాలలో వంద రోజులు, మూడు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎమ్.ఎమ్.లో ఏకధాటిగా 183 రోజులు ప్రదర్శితమైంది. అప్పట్లో రూ.10 కోట్లు వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది ఈ మూవీ.
5) ఆసక్తికరమైన విషయమేమంటే…రజినీ కాంత్ ‘మన్నన్’, చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్ర సన్నివేశాలను పక్క పక్కన ఒకేసారి చిత్రీకరించారు.
6) ఈ సినిమాలో ‘పండు పండు’.. అనే పాటలో హీరోయిన్ నగ్మాతో చిరంజీవి లిప్‌లాక్ చేయాల్సి ఉంటుంది. కానీ అయిష్టంగానే మెగాస్టార్ ఆ సీన్‌ను పూర్తి చేశారు. ఆ రాత్రంతా నిద్రపోని ఆయన మద్రాసుకు వచ్చిన వెంటనే ఎడిటింగ్ ల్యాబ్‌కు వెళ్లి లిప్‌లాక్ సీన్‌ను ఎడిట్ చేయించేశారు.
7) ఈ చిత్రంలోని ‘బంగారు కోడిపెట్ట’ సాంగ్‌ని 2009లో రాంచరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ లో రీమిక్స్ చేశారు.
8) కీరవాణి సంగీతం సూర్య మ్యూజిక్ ఆడియో కంపెనీని లాభాల వర్షంలో ముంచెత్తింది. క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘బంగారు కోడి పెట్ట’, ‘ఏందిబే’ పాటలు హోరెత్తి పోయాయి.
9) ఈ చిత్రానికి గాను చిరంజీవి భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా నిలిచారు. ఈ నేపథ్యంలో మలయాళ మనోరమా ఇంగ్లీష్ మ్యాగజైన్ చిరంజీవిని ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ గా కీర్తించాయి.
10) ‘ఘరానా మొగుడు’ ని 1993లో ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ లో ప్రదర్శించడం మరో గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవాలి.
11) ఈ చిత్రం ప్రారంభోత్సవానికి నందమూరి బాలకృష్ణ విచ్చేసి.. టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాదు మొదటి సీన్ కు క్లాప్ కొట్టింది కూడా ఆయనే..!
12) ‘ఘరానా మొగుడు’ లో చిరు-వాణి విశ్వనాథ్ ల మధ్య వచ్చే ‘అబ్బా ఇది ఏమి వాన’ అనే రొమాంటిక్ సాంగ్ తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది.
13) చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో రావు గోపాల్ రావు గారు విలన్ గా నటిస్తే.. ఈ మూవీలో మాత్రం మావగారుగా పాజిటివ్ రోల్ పోషించారు. ఇది కూడా అప్పటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలగజేసింది అనే చెప్పాలి.